సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఏపీలో నత్త నడకన సాగుతోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసు విచారణ సరిగా జరగడం లేదని, సాక్షులను నిందితులు, అనుమానితులు ప్రభావితం చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వివేకా కూతురు సునీత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కేసు విచారణ జరుపుతున్న దర్యాప్తు అధికారులపై కూడా ప్రైవేట్ కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.
ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు గతంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీం కొద్ది రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఏ రాష్ట్రానికి బదిలీ చేయబోతున్నారన్న విషయాన్ని తర్వాత వెల్లడిస్తామని చెప్పింది. ఏపీకి దగ్గరగా హైదరాబాద్ ఉందని, అందువల్ల కేసును అక్కడకు బదిలీ చేస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు గతంలో కోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. వివేకా కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేసినట్లు ఆధారాలున్నాయని సుప్రీం కోర్టు వెల్లడించింది. దర్యాఫ్తుపై మృతుడి భార్య, కూతురు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు దాకా రావడం బాధాకరమని దేశపు అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో వారి ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో అనేక కోణాలున్నాయని, ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు తప్పట్లేదని సుప్రీం కోర్టులో సీబీఐ వాపోయింది. విచారణాధికారులను కేసుల పేరుతో వేధింపులకు గురిచేశారని వెల్లడించింది. విచారణకు స్థానిక యంత్రాంగం సహకరించలేదని ఆరోపించింది.