సీఎం జగన్ పాలనతో ప్రజలు విసిగి వేసారి పోయారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాదుడే బాదుడు పేరుతో టిడిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. జనం నడ్డి విరిచేలా జగన్ వేస్తున్న పన్నులు, పెరుగుతున్న సరుకుల ధరలు, పెట్రోల్ ధరలు వంటి అంశాలతో టీడీపీ గతంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.
ఈ క్రమంలోనే తాజాగా వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్న ఉద్దేశ్యంతో ‘ఇదేమి ఖర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో టిడిపి నేతల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలోనే వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పెనమలూరు నియోజకవర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అభివృద్ధి చేయలేదని భారీ ఫ్లెక్సీలు వేసి టిడిపి నేతలు నిరసన చేపట్టారు. యనమలకుదురు బ్రిడ్జిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టిడిపి నేతలు, కార్యకర్తల మీదకు వైసీపీ శ్రేణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో టీడీపీ శ్రేణులు కూడా వారిని అడ్డుకున్నాయి.
ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్ది చెప్పి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, వైసీపీ శ్రేణులను వదిలేసి కేవలం టీడీపీ శ్రేణులపై మాత్రమే కేసు పెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.