బిజెపి నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కవిత త్వరలోనే కాంగ్రెస్లో చేరిపోతున్నారు అంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. ఈ క్రమంలోనే అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు నేతలు దాడి చేసి అక్కడ వస్తువులను పగలగొట్టి బీభత్సం సృష్టించారు. దీంతో, కేసీఆర్, కేటీఆర్, కవితల ఆదేశాలతోనే తన ఇంటిపై టిఆర్ఎస్ గూండాలు దాడి చేశారని అర్వింద్ ఆరోపించారు.
తన తల్లిని బెదిరించారని, ఇంట్లో వస్తువులను పగలగొట్టి భయబ్రాంతులకు గురి చేశారని అన్నారు. తన తల్లిని బెదిరించే అధికారం ఎవరు ఇచ్చారని అరవింద్ ప్రశ్నించారు. తనకు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు కవిత కాంగ్రెస్ లో చేరుబోతోందని చెప్పారని, ఆ విషయాన్ని తాను అన్నానని చెప్పుకొచ్చారు. కవిత గురించి అసభ్యకరంగా మాట్లాడలేదని, అభ్యంతరకరంగా మాట్లాడలేదని చెప్పారు. అందరి ఫోన్ లు ట్యాప్ చేస్తున్న కేసీఆర్…కవిత ఫోన్ ట్యాప్ చేస్తే అసలు నిజం బయటపడుతుందని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్, కవిత కులాహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. కవిత రాజకీయ జీవితం దాదాపుగా ముగిసింది అని, ఆ బాధ తాను అర్థం చేసుకోగలనని అన్నారు. చీటింగ్ కేసు తనపై కాదని కెసిఆర్ పై వేయాలని కవితకు అరవింద్ సలహా ఇచ్చారు. తన ఇంటిపై దాడి జరిగిన ఫోటోలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రధాని కార్యాలయానికి ఎంపీ అరవింద్ ట్యాగ్ చేశారు. కవితకు దమ్ముంటే 2024 ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని అరవింద్ సవాల్ విసిరారు. టిఆర్ఎస్ మేనిఫెస్టో చీటింగ్ అని ఎద్దేవా చేశారు.