ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలకు రక్షణ కరువవుతోంది. తమ నాయకులను బెదిరిస్తున్నారు. హత్య చేస్తున్నారు పట్టించుకోండి.. రక్షణ కల్పించండి..అ ని టీడీపీ అధినేత చంద్రబాబు.. డీజీపీకి ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా.. ఫలితం ఉండడం లేదు. పైగా..ఈ దాడులు కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా తునిలో తెలుగుదేశం పార్టీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం రాష్ట్రంలో కలకలం రేపింది.
మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు ఇంటి వద్దకు స్వామిమాల వేసుకుని వచ్చిన దుండగుడు.. బిక్ష తీసుకుంటున్నట్లు నటించి శేషగిరిరావుపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు.దీంతో శేషగిరిరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శేషగిరిరావుపై దాడిని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అన్యాయాలను నిలదీసే గళాన్ని అణిచివేసే కుట్రని ధ్వజమెత్తారు. శేషగిరిరావుపై పట్టపగలే హత్యాయత్నం జరగడం.. వెనుక వైసీపీ నేతలు ఉన్నారని.. టీడీపీ నాయకులు ఆరోపించారు.
ఎలా జరిగింది..?
గురువారం ఉదయం 6 గంటల సమయంలో… శేషగిరిరావు ఇంటికి గుర్తుతెలియని వ్యక్తి స్వామిమాల వేసుకుని వచ్చారు. అయ్యా భిక్షం పెట్టండి అని అర్ధించాడు. దీంతో అప్పుడు పూజ చేసుకుని బయటకు వచ్చిన టీడీపీ నాయకుడు శేషగిరిరావు స్వామిని లోపలికి ఆహ్వానించి.. రెండు అరటి పళ్లు ఇచ్చి.. బియ్యం వేస్తుండగా స్వామి రూపంలో ఉన్న హంతకుడు.. ఒక్కసారిగా కత్తి తీసి.. శేషగిరిరావు తలపై నరికేందుకు యత్నించాడు. అయితే.. దీనిని వెంటనే పసిగట్టిన శేషగిరిరావు తప్పిచుకున్నారు.
అయితే, మరోసారి చేతిపై దాడిచేసిన దుండగుడు ఆయన మెడపై బలంగా నరికాడు. దీంతో రక్తం కారి.. శేషగిరిరావు అక్కికక్కడే పడిపోయాడు. ఆ వెంటనే స్వామి రూపంలో ఉన్న హంతకుడు బైక్పై పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన బాధితుడిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేషగిరిరావును తెలుగుదేశం నేతలు యనమల, చినరాజప్ప పరామర్శించారు. వైసీపీ ఆగడాలకు తుని జనం భయభ్రాంతులకు గురవుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వాళ్లను చంపేందుకూ వెనుకాడట్లేదని ధ్వజమెత్తారు. శేషగిరిరావుపై…. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అనుచరులే దాడి చేశారని ఆరోపించారు. హత్యాయత్నంపై జగన్ బాధ్యత వహించాలన్నారు.
జగన్ గొడ్డలి పోటును.. మంత్రులు, ఎమ్మెల్యేలు వారసత్వంగా తీసుకున్నారని.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ ఆగడాలను నిలదీసే తెలుగుదేశం నేతల గళాలను అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించినందుకే శేషగిరిరావును చంపేందుకు యత్నించారని మండిపడ్డారు. హత్యాయత్నం చేసిన వారిని, చేయించిన వారిని కటకటాల వెనక్కి పంపే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.