రాష్ట్రంలో ‘సైకో’ పాలన పోయి ‘సైకిల్’ పాలన రావాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ‘తెలుగు మహిళ’ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘మాటామంతి’ కార్యక్రమం పోస్టర్ ను అనిత, తెలుగు మహిళ విభాగం నేతలు, టీడీపీ నేతలు ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే జగన్ పై అనిత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ ను నమ్మి ఓటేసి మహిళా వర్గం మోసపోయిందని, జగన్ ధన దాహానికి మహిళల తాళిబొట్లు తెగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష నేతగా మద్యపాన నిషేధం చేపడతానని ప్రగల్భాలు పలికిన జగన్…మహిళలను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. అమ్మఒడి, ఆసరా, 45 సంవత్సరాలకే పెన్షన్ చూసి జగన్ కు మహిళలు ఓట్లు వేయలేదని, కేవలం సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెబితేనే ఓట్లేశారని విమర్శించారు.మహిళలను టార్గెట్ చేసి జగన్ హింసిస్తున్నారని, పూటకో అత్యాచారం జరుగుతుంటే దిశ చట్టం ఏమైందని నిలదీశారు.
మహిళా కమిషన్ కు అత్యాచారాలు, హత్యల వివరాల బుక్ ఇచ్చామని, అయినా చలనం లేదని విమర్శించారు. జగన్ ను, ఆయన సతీమణిని ఏమన్నా అంటే మహిళా కమిషన్ స్పందిస్తుందని, కానీ, అత్యాచారాలపై మాత్రం స్పందించదని విమర్శించారు.
మద్య నిషేధం అని చెప్పిన వైసీపీ నేతలు ఎన్ని బేవరేజెస్ లను, ఎన్ని డిస్టలరీలను మూయించారో చెప్పాలని నిలదీశారు.
కరోనా మరణాల కంటే కల్తీ మద్యం బారిన పడి చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగాయని, జగన్ కు ధన పిశాచి ఆవహించిందా అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాకు చేరే ఆదాయం కన్నా తాడేపల్లి ప్యాలెస్ కు చేరే ఆదాయం ఎక్కువ అని విమర్శించారు. జగన్ పాలనపై గ్రామ గ్రామానికి వెళ్లి ‘మాటామంతి’ కార్యక్రమం ద్వారా మహిళలను చైతన్యపరుస్తామని చెప్పారు.