సాధారణంగా అయితే కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోవడానికి కొద్ది నెలలు…లేదంటే సంవత్సరాలు పడుతుంది. మన అనుకున్న వారు…నిన్నటి వరకు మనతో ఉన్న వారు ఇక లేరు..తిరిగి రారు అనే ఊహే చాలామందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అటువంటిది…ఒకే సంవత్సరంలో తన కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఆ బాధను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు.
ఈ ఏడాది మహేష్ బాబు..తన సోదరుడు రమేష్, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణలను కోల్పోయి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఈ ఏడాది జనవరిలో సోదరుడు రమేశ్ బాబుని మహేష్ బాబు పోగొట్టుకున్నారు. చిన్న వయసులోనే రమేష్ బాబు చనిపోవడంతో మహేష్ కుంగిపోయారు. ఆ బాధ నుంచి మహేష్ బాబు కోలుకునే లోపే ఈ ఏడాది సెప్టెంబర్ 28న మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఇప్పుడిప్పుడే మాతృవియోగం నుంచి తేరుకునేలోపే తండ్రి కృష్ణ మరణ వార్తను మహేష్ బాబు వినాల్సి రావడం బాధాకరం.
అందుకే, తన తండ్రి ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేని మహేష్ బాబు…కన్నీరుమున్నీరవుతున్నారు. తనను ఓదార్చడానికి వచ్చిన వారిని చూసిన మహేష్ బాబు వెక్కి వెక్కి ఏడుస్తున్న వైనం కలచివేస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ బాబుకు ఈ బాధను తట్టుకునే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నారు. మహేష్ బాబుకు వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
https://youtu.be/RY_YyAyVCXk