టాలీవుడ్ దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసింది. హఠాత్తుగా కృష్ణ మరణించడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కృష్ణకు నివాళులు అర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే కృష్ణ పార్థివ దేహాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సందర్శించి నివాళులర్పించారు. మహేష్ బాబును, కృష్ణ కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట కృష్ణ అల్లుడు, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. కృష్ణ మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చంద్రబాబు అన్నారు. కృష్ణ లేరన్న వార్త తనను కలచివేసిందని, తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా నిర్మాతల హీరోగా నటశేఖరుడిగా, సూపర్ స్టార్ గా అభిమానులతో పిలిపించుకున్న ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసోపేతమైన నిర్మాతగా కృష్ణను ఇండస్ట్రీలో ప్రశంసిస్తుంటారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా, విలక్షణ నటుడిగా పేరున్న కృష్ణ మరణం సినీ రంగానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసిందని అన్నారు. ఇటీవల తల్లిని, ఇప్పుడు తండ్రిని కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని లోటు అని అన్నారు.
మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని చంద్రబాబు కోరారు. ఇక, కృష్ణ మృతిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలతో కృష్ణ గారు చేసిన ప్రయోగాలు అద్భుతం అని లోకేష్ కొనియాడారు. వేగంగా సినిమాలు పూర్తిచేసి ఎన్నో రికార్డులు సృష్టించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని లోకేష్ ప్రార్థించారు. కృష్ణ మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎఐసిసి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు.
కృష్ణ మృతిపట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణగారు తెలుగువారి సూపర్ స్టార్ అని, ఆయనే అల్లూరి, ఆయనే మన జేమ్స్ బాండ్ అంటూ ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను కృష్ణ గారు సంపాదించుకున్నారని జగన్ అన్నారు. కృష్ణ మృతి తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ కు కృష్ణ గారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు ధైర్యాన్నివ్వాలని జగన్ కోరుకున్నారు. బుధవారం నాడు కృష్ణ పార్థివ దేహాన్ని ఏపీ సీఎం జగన్ సందర్శించి నివాళులు అర్పించనున్నారు.