ఎలాంటి పరిణామానికైనా సిద్ధం అవుదాం.. అరెస్టు కు తెగించినా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు.. దెబ్బలు పడే కొద్దీ రాటుదేలుతాం… మరింత కసిని పెంచుతుందన్న ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారా?
అవును అంటున్నాయి జనసేన వర్గాలు. ఇంతకాలం కేసులు.. జైలుకు వెనుకాడేలా వ్యవహరించే ఆయన ఇప్పుడు మాత్రం వాటికి అతీతంగా తన ఆలోచనలు ఉండాలన్నట్లుగా పవన్ సిద్ధమవుతున్నారన్న మాట వినిపిస్తోంది.
ఏ చిన్న అవకాశం వచ్చినా.. విడిచి పెట్టని జగన్ సర్కారు.. ప్రత్యర్థి రాజకీయ వర్గాలపై కేసులు నమోదు చేసేలా ప్రోత్సహిస్తుందన్న ఆరోపణను ఎదుర్కొంటోంది. అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. నోటికి ఎంత పని చెప్పినా పట్టని పోలీసులు.. విపక్షాలకు చెందిన వారి విషయంలో మాత్రం మరింత కటువుగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీతో నలభై నిమిషాల పాటు భేటీ అయి.. 24 గంటలు కూడా గడవక ముందే..కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామంపై కేసు నమోదు చేస్తూ తాడేపల్లి పోలీసులు నిర్ణయం తీసుకోవటం రాజకీయ కలకలాన్ని రేపుతుందన్న మాట వినిపిస్తోంది.
ఇలా కేసులు పెట్టటం ద్వారా.. తన ఉత్సాహాన్నితగ్గించాలన్నది జగన్ సర్కారు ఆలోచన అయితే.. దాన్నిఅస్సలు పట్టించుకోకుండా తాను చేయాలనుకున్నది చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
కేసు నమోదు చేసింది ఆలస్యం.. తగిన చర్యల దిశగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న వేళ.. ఇప్పటికినమోదైన కేసులతో అరెస్టు ప్రక్రియ ఉండదని.. రానున్న రోజుల్లో అరెస్టు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.
పవన్ ను అరెస్టు చేస్తే చోటు చేసుకునే రాజకీయ పరిణామాల మీద వైసీపీలో రెండు వాదనలు బలంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు.
1. మిగిలిన నేతలకు ఏ మాత్రం పవన్ అతీతుడు కాదని.. తమ ప్రభుత్వ సిగ్నేచర్ ను జనసేనాని విషయంలోనూ విడిచిపెట్టకుండా ఉండటమే మంచిదని ఒక వర్గం వారు వాదిస్తున్నారు.
2. ఈ వాదనకు భిన్నంగా.. జనసేనానిపై కేసుల నమోదు వరకు ఇబ్బందేమీ లేదని.. కానీ.. ఒక్కసారి అరెస్టు చేస్తే మాత్రం సానుభూతి పెద్ద ఎత్తున వస్తుందని.. అంతవరకు విషయాన్ని తేకుండా ఉండటమే మంచిదన్న భావనను ఇంకో వర్గం వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ లాజిక్ మరిచిపోతే వైసీపీకి నష్టం అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీ సర్కారు ఏం చేసినా సరే.. పోరాటాన్ని ఆపకూడదని.. తాము నిలబడిన స్టాండ్ కోసం ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నట్లుగా పవన్ ఉన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.