రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ఒకే సెంటిమెంట్ పదేపదే రిపీట్ అవుతుంటే సహజంగానే దాని గురించి అందరిలోనూ ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, ప్రముఖ తెలుగుదేశం నాయకుడు ముళ్ళపూడి బాపిరాజు పొలిటికల్ కెరీర్‌ను క్లోజ్ చేయబోతుందా ? అన్న చర్చలు ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్నాయి. తాజాగా బాపిరాజు కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు కూడా ఇది నిజం కానుందా ? అన్న సందేహాలు కలుగజేస్తున్నాయి.
గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండలానికి చెందిన ముళ్లపూడి బాపిరాజు చిన్న వయసులోనే
రాజకీయాల్లోకి వచ్చి 2006లో సొంత మండలం నల్లజర్ల నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో జరిగిన ట్రయాంగిల్ ఫైట్‌లో బాపిరాజు తాడేపల్లిగూడెంలో మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.
2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు కారణంగా తాడేపల్లిగూడెం సీటు ఆ పార్టీకి కేటాయించడంతో.. చంద్రబాబు బాపిరాజు కష్టాన్ని గుర్తించి పశ్చిమగోదావరి జడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ఎంతో మంది పోటీ ఉన్నా యువతను ఎంకరేజ్ చేయాలనే బాబు ఆ పదవి ఆయనకు కట్టబెట్టారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు జడ్పీ ఛైర్మన్‌గా ఓ వెలుగు వెలిగాడు బాపిరాజు.
ఉమ్మడి జిల్లాతో పాటు మెట్ట ప్రాంతంలో కీ రోల్ పోషించారు. ఇక తన సొంత నియోజకవర్గ గోపాలపురం ఎస్సీ రిజర్వ్ కావడంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కంటే బాపిరాజు ఆధిపత్యమే ఎక్కువగా నడిచింది. ఇక గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటు రాకపోదా ? అని బాపిరాజు విశ్వ ప్రయత్నాలు చేశారు.
చివర్లో తాడేపల్లిగూడెం లేదా ఉంగుటూరు సీట్ల కోసం ప్రయత్నించినా గూడెంలో క్యాస్ట్ ఈక్వేషన్లు కలిసి రాలేదు. అప్పటి ఉంగుటూరు ఎమ్మెల్యే ( ప్రస్తుత ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు) పార్టీకి, చంద్రబాబుకు అత్యంత విధేయుడు కావడంతో ఇక్కడ బాపిరాజు పేరు బాబు పట్టించుకోలేదు.
బ్యాడ్ సెంటిమెంట్‌తో విలవిలా…
బాపిరాజుది దూకుడు స్వభావమే ఇప్పుడు ఆయనకు మైనస్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు జిల్లా టీడీపీలో జడ్పీచైర్మన్‌గా పనిచేసిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఓ సెంటిమెంట్ ఇప్పుడు బాపిరాజును కూడా వెంటాడుతోంది. గత రెండున్నర దశాబ్దాల్లో చూస్తే 1996 జడ్పీ ఎన్నికల్లో పార్టీ నుంచి ఇమ్మణ్ణి రాజేశ్వరి జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఆమె ఉంగుటూరులో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు అడ్రస్ లేకుండా పోయారు.
20 ఏళ్లుగా ఆశ నిరాశాల్లో జయరాజు :
ఇమ్మణ్ణి రాజేశ్వరి తర్వాత జడ్పీచైర్మన్‌గా ఎస్సీ కోటాలో కొక్కిరిగడ్డ జయరాజు పనిచేశారు. ఆయన కూడా ఐదేళ్లు ఆ పదవిలో ఉన్నారు. అయితే ఆ తర్వాత 20 ఏళ్లలో ఆయన అసెంబ్లీ టిక్కెట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అసెంబ్లీ గడప తొక్కాలన్న జయరాజు కోరిక ఏమోగాని అసలు టిక్కెట్టే రావడం లేదు. 2004 – 2009 – 2014- 2019 నాలుగు ఎన్నికల్లోనూ జయరాజు ఆశలు నెరవేరడం లేదు. ఇప్పటకీ జయరాజు ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఉమ్మడి జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నా కూడా బాబు అసలు జయరాజు పేరే ప్రపోజల్స్ లోకి కూడా తీసుకోవడం లేదు.
బాపిరాజు రాజకీయం కూడా డైలమామే…
ఇక సొంత నియోజకవర్గం రిజర్వ్డ్ కావడం.. వచ్చే ఎన్నికల్లోనూ అసెంబ్లీ సీటు వస్తుందన్న గ్యారెంటీ లేకపోవడంతో పాటు… తాజాగా పార్టీ అధిష్టానంతో రోజు రోజుకు గ్యాప్ పెరుగుతోన్న నేపథ్యంలో బాపిరాజు రాజకీయం కూడా ఏదైనా అద్భుతం జరిగితే తప్పా ముగిసేలాగానే ఉంది. గోపాలపురం కొత్త ఇన్చార్జ్గా వచ్చిన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ మద్దిపాటి వెంకట్రాజు ఎంట్రీ ఇవ్వడం బాపిరాజుకు సుతారామూ ఇష్టం లేదు. అయితే చంద్రబాబు, లోకేష్ పట్టుబట్టి వెంకట్రాజు పార్టీ ఓడిపోయాక చేసిన సేవలు గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు.
అయితే బాపిరాజు మాత్రం చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్నిసార్లు చెప్పినా మాజీ ఎమ్మెల్యే ముప్పిడినే ఇన్చార్జ్గా కొనసాగించాలని పట్టుబడుతున్నారు. చివరకు జిల్లా టీడీపీ కీలక నేతలు సర్దిచెపుతున్నా బాపిరాజు మాత్రం అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ తెగేదాకా లాగుతున్నారు. ఈ పరిణామాలపై చంద్రబాబు సైతం ఆగ్రహంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో బాపిరాజు వెనక్కు తగ్గకపోతే వ్యవహారం ముదిరి ఆయన రాజకీయ భవితవ్యాన్నే ప్రశ్నార్థకంగా మార్చేయనుంది. మరి బాపిరాజు బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా ? ఆయన భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందో ? చూడాలి.