ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ ను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ట్విటర్ చేతికి వచ్చీ రాగానే భారత సంతతికి చెందిన అగర్వాల్ ను ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి మస్క్ తీసేయడం సంచలనం రేపింది. ఇక, ట్విట్టర్ లీగల్ అడ్వయిజర్ గా ఉన్న విజయ గద్దెతోపాటు పలు కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులను మస్క్ తొలగించి అందరికీ షాక్ ఇచ్చాడు.
వారితోపాటు సంస్థలోని సగం మంది ఉద్యోగులను మస్క్ తొలగించడంతో అందరూ ఖంగుతిన్నారు. అయితే, తమ తప్పు తెలుసుకున్న తర్వాత కొంతమందిని వెనక్కి రావాలని పిలిచినా వారు రాలేదు. ఈ నేపథ్యంలోని మరికొంత ఉద్యోగులు తమంతట తామే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ పై మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే, ట్విట్టర్ దివాలా తీసే అవకాశాలున్నాయంటూ మస్క్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఖర్చు పెడుతున్న దానికంటే ఎక్కువ నిధులను సంస్థల్లోకి తేవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. అప్పుడే పోటీలో నిలవగలమని, అలా చేయకుంటే భారీగా నష్టాలు వస్తాయని మస్క్ చెప్పాడు. భారీ నష్టాలతో 100 కోట్ల మంది యూజర్లకు చేరువ కాలేమని, అది గిట్టుబాటు కాదని, అదే జరిగితే దివాలా తీయడం ఖాయమని మస్క్ అభిప్రాయపడ్డాడు. దీంతో మస్క్ ట్విట్టర్ ను ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. తన చర్యలతో ఉద్యోగులను మస్క్ అభద్రతాభావంలోకి నెట్టేస్తున్నారని, ఒంటెత్తు పోకడలు తప్పు అని తెలుసుకునే లోపు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.