ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోట్లు శరత్ చంద్రారెడ్డి రిమాండ్ రిపోర్ట్ ను కోర్టులో అధికారులు సమర్పించారు. ఈ సందర్భంగా ఈ కుంభకోణంలో శరత్ పాత్ర గురించి సంచలన విషయాలను అధికారులు ప్రస్తావించిన వైనం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశాల ఆధారంగానే శరత్ ను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం వ్యవహారానికి కీలక సూత్రధారి శరత్ చంద్రా రెడ్డి అంటూ ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కుంభకోణం మొత్తంలో కీలకంగా భావిస్తున్న సౌత్ గ్రూపును ఏర్పాటు చేసింది శరత్ అని ఈడీ అధికారులు ఆరోపించారు. సౌత్ గ్రూప్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలను శరత్ ముడుపుల రూపంలో అందించారని, వినయ్ నాయక్ మరో 100 కోట్లు ముడుపులు చెల్లించారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.
ఈ స్కామ్ వల్ల శరత్ ఇప్పటికే భారీ స్థాయిలో లాభాలు కూడా వెనకేశారని ఈడీ తన రిపోర్టులో వెల్లడించింది. సౌత్ గ్రూప్ పేరుతో శరత్ ఢిల్లీలోని 30% లిక్కర్ బిజినెస్ ను తన గుప్పెట్లోకి తీసుకున్నారని ఈడీ అధికారులు ఆరోపించారు. అంతేకాకుండా, బినామీ కంపెనీల ద్వారా నగరంలోని మొత్తం తొమ్మిది జోన్లను శరత్ దక్కించుకున్నారని ఈడీ వెల్లడించింది. ఈ జోన్ల ద్వారానే దాదాపు 64 కోట్ల రూపాయలను శరత్ అర్జించారని, ఆ మొత్తంలో 60 కోట్ల రూపాయలను మరో స్పిరిట్ కంపెనీకి బదలాయించాలని ఆరోపించింది.