ఓబుళాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గతంలో అరెస్టయి ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచి ముడుపులు స్వీకరించారంటూ శ్రీలక్ష్మిపై అభియోగాలు నమోదయ్యాయి. 2004-2009 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
మైనింగ్ లీజులు పొందేందుకు శ్రీలక్ష్మి సహకరించారని, అందుకోసం ఆమెకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలపై విచారణ జరిపిన సిబిఐ అధికారులు శ్రీలక్ష్మిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత శ్రీలక్ష్మి బెయిల్ పై విడుదలయ్యారు. ఇక ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఏపీకి జగన్ సీఎం కావడం, ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేయడం జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఆమెపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇస్తూ మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిబిఐ రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇదే, వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి కేసు గురించి సుప్రీంకోర్టులో సిబిఐ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి నియామగానికి అడ్డు తొలగినట్లు అయింది.