ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యం బాగోలేదా? ఆయన ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారా? తరచూ చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఈ వాదనకు బలం చేకూరేలా చేయటమే కాదు.. కొత్త భయాలకు కారణమవుతున్నాయి.
78 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ రికార్డును క్రియేట్ చేశారు. అంత పెద్ద వయసులో అమెరికా అధ్యక్షుడిగా అంటే మాటలు కాదు. అయితే.. అగ్రరాజ్యాధిపతి అయిన ఆయన ఆరోగ్యం ఇటీవల కాలంలో సరిగా లేదన్న మాట వినిపిస్తోంది.
ఈ వాదనకు తగ్గట్లే.. తరచూ ఆయన మాటల్లో.. చేతల్లో జరుగుతున్న పొరపాట్లుకొత్త సందేహాలకు కారణంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో బైడెన్ తరచూ తడబడుతున్నారని.. పేర్లు.. హోదాలు చెప్పే విషయంలో తికమక పడుతున్నట్లు చెబుతున్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను ప్రెసిడెంట్ హ్యారిస్ గా ఆయన సంబోసదించటమే కాదు.. తాజాగా ఎయిర్ ఫోర్సు వన్ విమానాన్ని ఎక్కే సందర్భంలో పలుమార్లు తూలి పడబోయినట్లు చెబుతున్నారు.
జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి అట్లాంటాకు ఎయిర్ ఫోర్సు వన్ లో ప్రయాణానికి విమాన మెట్లు ఎక్కే సందర్భంలో మూడుసార్లు జారి పడబోయినట్లు చెబుతున్నారు. రెయిలింగ్ పట్టుకొని అతి కష్టం మీద లేచి మెట్లు ఎక్కారంటున్నారు. ఇలా ఒకటి కాదు రెండుకాదు.. ఏకంగా మూడుసార్లు జరగటంతో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఈ ప్రచారంపై వైట్ హౌస్ ఏలా స్పందిస్తుందో చూడాలి.