“ప్రతిపక్షాలు అనవసరంగా కుట్ర చేస్తున్నాయి. మాపై బురద జల్లుతున్నాయి. మేం ఏపీని రామరాజ్యం చేస్తుంటే.. కుళ్లు, కుట్రలతో మాపై విమర్శలు చేస్తున్నాయి“ అని వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు.. మరీ ముఖ్యంగా సీఎం జగన్ కూడా తరచుగా ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు, తాము ప్రవేశ పెడుతున్న పథకాలతో మేలు జరుగుతోందని అంటున్నారు. పైగా పేదలకు ఆరోగ్యాన్ని అందించేందుకు అనేక వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామని.. కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నామని చెబుతున్నారు. అంతేకాదు.. రెండు రోజుల కిందట ఆరోగ్య శ్రీ పథకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా దీన్ని బలోపేతం చేస్తున్నామన్నారు.
“రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీనే. ఈ విషయంలో మమ్మల్ని విమర్శించేవాళ్లు ఆసుపత్రులకు వెళ్లి పరిశీలించాలని కోరుతున్నా“ అని సీఎం జగన్ సభా ముఖంగానే చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆరోగ్య శ్రీ పథకంలో అందిస్తున్న సేవలను కూడా రెట్టింపు చేశామని.. గతంలో 2వేల కేసులకు చికిత్స అందిస్తుంటే తాము ఇప్పుడు దాదాపు 4 వేలకు పెంచామని కూడా సీఎం చెప్పారు. ఇక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ అయితే.. మరింతగా మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని సేవలు అందిస్తున్నామన్నారు.
సరే.. ఇప్పుడు విషయానికి వద్దాం.. ఏపీ మంత్రి, ఉన్నత విద్యావంతుడు ఆదిమూలపు సురేష్‌కు ఇటీవల మోకాలికి గాయమైంది. తొలుత ఆయన గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే చూపించుకున్నారట. ఇక్కడ పరీక్షించిన వైద్యులు.. మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ చేయాలని ఎప్పుడు కుదిరితే అప్పుడు చేద్దామని సూచించారు.
తగిన మందులు కూడా ఇచ్చారు. అయితే.. ఆయన ఏమనుకున్నారో ఏమో దీపావళి అనంతరం(అప్పటికి ఆయన చైర్లోనే ఉన్నారు) వెంటనే వెళ్లి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో జాయిన్ అయిపోయారు. మరి ఆయనకు గుంటూరు వైద్యులపై నమ్మకం లేదో, లేక ఏపీలో సరిగా సేవలు అందవని భావించారో తెలియదు కానీ ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ట్రీట్మెంట్ పొందుతున్నారు.
ఈ సందర్భంగా ఆయనను పలకరించేందుకు వెళ్లిన మరో మంత్రి(హోంశాఖ) తానేటి వనిత ఆయనకు ఆసుపత్రిలో పుష్ప గుచ్ఛం ఇచ్చినప్పటి ఫొటోనే ఇది. కట్ చేస్తే.. ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించుకోవాలి. ఒకటి.. చంద్రబాబు హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్ పనిచేశారు.
ఆయన బీజేపీ నేత. అయితే, అప్పట్లో ఆయనకు కూడా ఇదే సమస్య వచ్చింది. మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలనివైద్యులు చూసించారు. దీంతో ఆయన తటపటాయించకుండా గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకున్నారు. మరి ఇప్పుడు మంత్రి ఎందుకు వెళ్లారో తెలియాలి!
రెండు.. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రులపై ప్రశ్నలు సంధించారు. దీనిలో ఒకటి.. వైద్య ఆరోగ్య శాఖను ఉద్దేశించిందే. అదేంటంటే.. “మీ సహచర మంత్రులు అనారోగ్యానికి పక్కరాష్ట్రాలకు పారిపోకుండా ఏపీలోనే వైద్యం చేయించుకునే స్థాయి సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారు.. పబ్లిసిటీ క్వీన్“ అని. మరి.. ఏపీలో ఏం జరుగుతోందో.. వైద్యం ఎంత బాగుందో చెప్పాల్సిన పని ఉందా?!