బాంబే హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. పోలీస్ స్టేషన్ లో వీడియో తీయటం తప్పేమీ కాదని.. అదేమీ నిషిద్ధ ప్రదేశం కాదని స్పష్టం చేసింది. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నిషిద్ధ ప్రాంతాల జాబితాలో పోలీస్ స్టేషన్ లేదని తెలిపింది.
అందుకే.. వీడియోలు తీయటం సరికాదన్న తీర్పును తాజాగా బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ వెల్లడించింది. ఇంతకీ ఈ తీర్పు ఇవ్వడానికి చోటు చేసుకున్న కారణాన్ని చూస్తే.. అసలు విషయం అర్థమవుతుంది.
మహారాష్ట్రలోని వార్దాకు చెందిన రవీంద్రకు ఆయన పొరుగున ఉన్న వ్యక్తికి మధ్య గొడవ జరిగింది. విషయం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇరు పక్షాలు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్నాయి.
పోలీస్ స్టేషన్ లో చర్చలు జరుగుతున్న వేళలో.. రవీంద్ర తన సెల్ ఫోన్ తో వీడియో తీశారు. దీంతో ఆయనపై అధికారిక రహస్యాల చట్టం కింద రవీంద్రపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరుకుంది.
అధికారిక సమాచారానికి సంబంధించిన కొన్ని అంశాలు బయటకు రాకుండా ఉండేందుకు కొన్ని ప్రాంతాల్ని నిషిద్ధ ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ ఫోటోలు.. వీడియోలు తీయటం చట్టవిరుద్ధం. అయితే.. ఆ చట్టంలోని సెక్షన్ 2(8)తో పాటు సెక్షన్ 3లో ఏయే ప్రాంతాల్ని ఈ జాబితాలో ఉంచాలో పేర్కొన్నారు. అందులో పోలీస్ స్టేషన్ లేని కారణంగా.. పోలీస్ స్టేషన్ లో వీడియోల చిత్రీకరణ తప్పు కాదని పేర్కొంది.
ఈ కీలక తీర్పును జస్టిస్ మనీష్ పిటాలే.. జస్టిస్ వాల్మీకి మెనెజెస్ ల ధర్మాసనం ఇచ్చింది. సో.. పోలీసు స్టేషన్ కు వెళ్లినప్పుడు సెల్ ఫోన్ తో ఫోటోలు.. వీడియోలు తీయటం తప్పేమీ కాదు. కానీ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.