దారుణ ఉదంతం చోటు చేసుకుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో నిర్వహించిన వేడుకలు వందకు పైగా ప్రాణాల్ని బలి తీసుకుంది. అక్కడి ప్రజలు వేడుకగా నిర్వహించుకునే హోలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
వేడుకల్లో భాగంగా సంబరాలకు గుమిగూడిన జనం ఒక ఇరుకైన సందులోకి పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 120 మంది ప్రాణాలు పోగా.. వందకు ప్రజలు గాయాల బారిన పడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాటలో ఎక్కువ మందికి ఊపిరి ఆడకపోవటంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
సియోల్ లోని ఇటెవోస్ ప్రాంతంలో హోలోవీన్ ర్యాలీలో లక్షకు పైగా ప్రజలు పాల్గొన్నట్లు అంచనా. అయితే.. అక్కడికి దగ్గర్లో ఒక సెలబ్రిటీ బార్ కు వచ్చినట్లుగా ప్రచారం జరగటం.. ఆ సెలబ్రిటీని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పరుగులు తీశారు. ఇదంతా ఒక ఇరుకైన వీధిలో చోటు చేసుకుంది. దీంతో.. ఏర్పడిన తొక్కిసలాటలో ప్రజలు కింద పడ్డారు.
పలువురికి గుండెపోటుకు గురి కాగా.. మరికొందరు ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు. రోడ్ల మీద ఒకరిపై ఒకరు పడి ఉన్న దారుణ దృశ్యాలు కనిపించాయి. ఈ తొక్కిసలాటలో కింద పడి.. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించి.. ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
తొక్కిసలాట చోటు చేసుకున్న కాసేపటికే సహాయక చర్యల కోసం 400 మంది సిబ్బందిని.. 140 వాహనాల్ని వినియోగించినట్లుగా అధికారులు చెబుతున్నారు. వీధుల్లోనే పలువురికి సీపీఆర్ చేయటం ద్వారా పలువురి ప్రాణాలు కాపాడినట్లుగా చెబుతున్నారు. కరోనా తర్వాత జరిగిన ఈ వేడుకల్లో ప్రజలు భారీగా హాజరయ్యారు.
ఈ వేడుకలు జరిగే ప్రాంతం ఏ మాత్రం సురక్షితం కాదంటూ.. తొక్కిసలాటకు కొన్ని గంటల ముందే సోషల్ మీడియాలో ప్రచారం సాగటం గమనార్హం. అనూహ్య విషాద ఘటన అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అత్యవసర భేటీ నిర్వహించి.. పరిస్థితిని సమీక్షించారు. వేడుక ఏమో కానీ.. 120 మంది కుటుంబాల ఉసురు తీసిందని చెప్పక తప్పదు.