Ginna trolls : తాను నటించే సినిమాల గురించి మంచు విష్ణు మాటలు చూస్తే కోటలు దాటుతుంటాయి. కానీ అతడి సినిమాలు చూస్తే బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిపిస్తుంటాయి. అతడి చివరి సినిమా మోసగాళ్ళు గురించి ఎంత బిల్డప్ ఇచ్చాడో తెలిసిందే. కానీ ఆ సినిమా దారుణమైన ఫలితాన్నందుకుంది.
ఇక విష్ణు కొత్త సినిమా జిన్నాకు సంబంధించి ప్రమోషన్ల హడావుడి మామూలుగా లేదు. కానీ తీరా చూస్తే సినిమా బడ్జెట్ సంగతి పక్కన పెడితే పబ్లిసిటీ కోసం పెట్టిన ఖర్చు కూడా వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు. దీపావళికి గట్టి పోటీ ఉన్నా పట్టుబట్టి పండగ ముందు సినిమాను రిలీజ్ చేశాడు విష్ణు.
చాలా థియేటర్లలో రిలీజ్‌కు కొన్ని గంటల ముందు వరకు కూడా ఒక్కటంటే ఒక్క టికెట్ల తెగని పరిస్థితి. అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి ఘోరాతి ఘోరం.
రిలీజ్ తర్వాత అయినా పరిస్థితి మారుతుందేమో అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. సినిమాకు పరవాలేదనే టాక్ వచ్చినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. చాలా వెబ్ సైట్లు కూడా మిగతా మూడు సినిమాలకు రివ్యూలిచ్చి, ఈ సినిమాను పట్టించుకోలేదు. బజ్ లేని సినిమాకు ఏం రివ్యూలిస్తామని వదిలేసినట్లున్నారు.
ఈ సినిమా టాక్ ఎలా ఉందని చెప్పేవాళ్లు కూడా కరవయ్యారు. ఎవరికీ ఆసక్తి లేదు మరి. ఈ సినిమా తొలి రోజు రిలీజైన అన్ని సెంటర్లలో కలిపి రూ.15 లక్షల వసూళ్లు మాత్రమే రాబట్టిందట. అవి థియేటర్ల మెయింటైనెన్స్‌కు మాత్రమే సరిపోతాయి. కొన్ని చోట్ల ఆ మొత్తం కూడా రాలేదు.
యుఎస్‌లో అయితే సినిమాకు తొలి రోజు మొత్తం కలిపి 43 టికెట్లు మాత్రమే తెగడం, కొన్ని వేల రూపాయలు మాత్రమే వసూళ్లు రావడం గమనార్హం. సన్నీలియోన్ కూడా ఉన్న సినిమా పరిస్థితి ఇది. మంచు వారికి ఇంతకంటే ఘోర పరాభవం ఏముంటుంది?