టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ భేటీ కావడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీ, జనసేల మధ్య పొత్తు ఖరారైందనే ఊహాగానాలు జోరందుకోవడంతో ఆ వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.జనసేన, టీడీపీలు కలిసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని తాము చాలాకాలం నుంచి చెబుతున్నామని ఆయన అన్నారు.
ఆ విషయంలో చంద్రబాబు, పవన్ ల భేటీతో మరోసారి తేలిపోయిందని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేల మధ్య పొత్తు తథ్యమని, జనసేనకు 25 నుంచి 30 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని పేర్ని నాని చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఏపీలో బీజేపీ 15 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేలా ప్రతిపాదనలు కూడా చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత ఓ ఇంటర్వ్యూలో చెప్పారని నాని అన్నారు.
అయితే, నాని కామెంట్ల నేపథ్యంలో ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సీట్ల పంపకంపై క్లారిటీ రాకుండానే చంద్రబాబు, పవన్ లు కలిసి ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారా అన్న కామెంట్లు వస్తున్నాయి. పవన్ తో చంద్రబాబు ప్రాథమిక చర్చలు కూడా జరిపారని టాక్. ఇక, టీడీపీతో కలిసి పోరాటం చేసేందుకు బీజేపీ ముందుకొస్తేనే బీజేపీతో దోస్తీని పవన్ కొనసాగించే అవకాశాలున్నాయని అంటున్నారు.
బీజేపీకి ఊడిగం చేయం..అని పవన్ చేసిన వ్యాఖ్యల ద్వారా పవన్ ఆ దిశగా సంకేతాలిచ్చారని చెబుతున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వానికి కూడా పవన్ పరోక్షంగా మెసేజ్ పంపించారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి.