ఏపీ రాజధాని అమరావతి వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతేనని రైతులు పాదయాత్ర చేస్తున్నారు. అయితే, వారి ఉద్యమాన్ని అడ్డుకొని మూడు రాజధానుల కాన్సెప్ట్ ను ప్రమోట్ చేసుకోవడానికి వైసీపీ నేతలు విఫలయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి అమరావతే రాజధాని అని ప్రధాని మోడీ కూడా అన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన వైసీపీ నేతలలకు రుచించడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా అమరావతిపై ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని, ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరి అని రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్లు చేశారు. అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాహుల్ తెలిపారు. అమరావతి రైతుల ఉద్యమానికి న్యాయపరమైన సాయం అందిస్తామని కూడా రాహుల్ అన్నారు. అమరావతి రైతుల పోరాటానికి పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నానని వెల్లడించారు.
ఏపీలో తన పాదయాత్ర సాగే సమయంలో వీలైతే అమరావతి రైతుల పాదయాత్రలో కూడా పాల్గొంటానని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్నూలు జిల్లా హాలహర్విలో జరుగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని అమరావతి జేఏసీ సభ్యులు, పోలవరం నిర్వాసిత రైతులు కలిశారు. వారంతా రాహుల్ గాంధీ బస చేసిన శిబిరానికి చేరుకొని ఆయనతో భేటీ అయ్యారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాలని రాహుల్కు వారు వినతిపత్రం అందించారు. వారి వినతికి రాహుల్ సానుకూలంగా స్పందించారు. మోడీతోపాటు రాహుల్ కూడా అమరావతికి జై కొట్టడంతో పాదయాత్ర చేస్తున్న రైతులలో కొత్త జోష్ వచ్చింది.