ఒక్క రూపాయికే కార్పొరేట్ స్థాయి వైద్యం? సాధ్యమా అంటే..అవునంటారు గంగాధర్ గుప్తా కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యం పక్కా కమర్షియల్ గా ఈ రోజుల్లో కలియుగ దాన కర్ణుడిగా చెప్పుకోదగ్గ గంగాధర్ గుప్తా దాన గాథ ఇది….
2020 మార్చి నెలలో మొదలైన కరోనా విలయతాండవం ఇప్పటికీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. పడగ విప్పిన విష సర్పంలా ఈ మహమ్మారి ప్రజలపై విరుచుకుపడింది. మొదటి వేవ్ లో కరోనా గురించి అవగాహన లేక లక్షలాది మంది అసవులు బాశారు. ఇక, రెండో వేవ్ లో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల,వైద్యుల, సిబ్బంది కొరతతో మరెందరో ప్రాణాలు కోల్పోయారు. కిక్కిరిసిన ఆస్ప్రత్రులు..నిండిపోయిన మార్చురీలు… అంత్యక్రియలు చేసేందుకు శ్మశానాలకు శవాలను తరలించేందుకూ కష్టపడాల్సిన పరిస్థితులు..బహుశా ఎవరూ మర్చిపోరేమో.
సంప్రదాయాలను పక్కనబెట్టి మరీ గ్యాస్ యంత్రాల ద్వారా దహనం చేయాల్సిన పరిస్థితుల్లో గ్యాస్ డెలివరీ చేయడానికి వాహనాల డ్రైవర్లు జంకుతున్న రోజులవి. అటువంటి క్లిష్టపరిస్థితుల్లో గ్యాస్ ఏజెన్సీ ఓనర్ అయిన గంగాధర్ గుప్తా తానే డ్రైవర్ గా మారి రోజూ ఆస్పత్రులకు సిలెండర్లు డెలివరీ చేశారు. ఆస్పత్రులలో శవాల గుట్టలు, వరండాలో, ఆస్పత్రి ప్రాంగణంలో ప్రాణాల కోసం పోరాడుతున్న రోగుల అవస్థలను చూసి గుప్తా చలించిపోయారు. ప్రైవేటు ఆస్పత్రులలో లక్షలు పెట్టగలిగిన వారి పరిస్థితే దయనీయంగా ఉంటే..ఇక, పైసా ఖర్చుపెట్టలేని పేదోడి పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన గుప్తాను కలిచివేసింది.
ఆ సమయంలోనే పేదలకు ఒక్క రూపాయితోనే మెరుగైన వైద్యం ఎందుకు అందించకూడదు అన్న ప్రశ్న ఆయన మదిలో మెదిలింది. జెంటిల్మన్, గణేష్ వంటి, ఠాగూర్ వంటి సినిమాలు చూసినపుడో..కరోనా టైంలోనో ఈ తరహా ఆలోచనలు చాలామందికి వచ్చి ఉంటాయి. అయితే, గుప్తాకు వచ్చిన ఆలోచన మాత్రం ఆచరణ రూపం దాల్చింది. కానీ, అందుకు ఆయన చేసిన త్యాగం…పెట్టిన ఖర్చు…గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
గ్యాస్ ఏజెన్సీ ద్వారా వచ్చిన ఆదాయంతో రామ్ నగర్ లో గుప్తా ఓ స్థలం కొన్నారు. అక్కడ ఓ కమర్షియల్ కాంప్లెక్సు కట్టి అద్దెకివ్వాలన్నది ఆయన ఆలోచన. ఇదంతా కరోనాకు ముందు. కరోనా కరాళ నృత్యాన్ని కళ్లారా చూసిన గుప్తా…తన కమర్షియల్ ఆలోచనకు స్వస్థి చెప్పారు. సేవా దృక్పథంతో ‘రూపాయికి వైద్యం’ చేయాలని సంకల్పించారు. ఆ సంకల్పం కోసం కోట్లు విలువ చేసే భూమిలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలని నిర్ణయించుకున్నారు.
ఆ ఆస్పత్రి భూమిపూజ మొదలు…ఓపీ సేవలకు అనుమతి వచ్చే వరకూ …ఈ ప్రయాణంలో గుప్తా ఎన్నో ఒడిదుడుకులను, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ, ఎక్కడా వెనుకడుగు వేయలేదు. మొత్తం ఆసుపత్రి నిర్మాణానికి దాదాపు 20 కోట్లు ఖర్చుపెట్టారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని బాలయోగీశ్వర స్వామీజీలను విశ్వసించే గంగాధర్…తన తండ్రి గంగయ్య పేరునే ఆ ఆసుపత్రికి పెట్టుకున్నారు. వైద్యసేవలతో పాటు రాయితీతో రక్తపరీక్షలూ, ఎక్స్ రేలూ, ఈసీజీ వంటి సేవలను తన డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా అందిస్తున్నారు. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ తోపాటు 50 పడకలతో ఇనేపేషంట్ బ్లాక్స్ ను ఏర్పాటు చేశారు..
జీజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్, గైనిక్ తదితర సేవలు అందించేందుకు 18 మంది డాక్టర్లున్నారు. మందులూ, టెస్టులపై 50శాతం రాయితీ ఇస్తున్నారు. పేదలు డబ్బు చెల్లించలేమంటే వారికి ఉచితంగానే ఆ సేవలను అందిస్తారు. తెలంగాణ, ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి రోజుకు దాదాపు 2000 మంది రోగులు ఇక్కడ వైద్యం చేయించుకునేందుకు వస్తుంటారు.
రోగి వివరాలనుబట్టి ఉచితంగా భోజనం లేదా టిఫిన్, కాఫీ, టీలూ అందిస్తారు. అన్నంలో కూర, రోటి పచ్చడీ, సాంబారూ, మజ్జిగా ఇస్తారు. టిఫిన్ కి ఇడ్లీ, దోసె, వడ, పూరీ, చపాతీ, పరోటా, ఉప్మా వంటివి ఉంటాయి. గంగాధర్ సతీమణి రోగులకు ఆహారం, మెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిని ఆ దంపతులు అతిథులుగా చూసుకుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు విశ్రాంతి తీసుకోవడానికీ, రాత్రిపూట బస్సులకు వెళ్లలేనివారు ఉండటానికీ వెసులుబాటునూ కల్పిస్తున్నారు.
సమాజం మనకేమిచ్చింది అని చాలామంది అడుగుతుంటారు. కానీ, సమాజానికి మనమేమిచ్చాం? అని కొందరే తమను తాము ప్రశ్నించుకుంటుంటారు. సొంతలాభం కొంత మానుకొని గట్టి మేల్ తలపెట్టవోయ్…అన్న సూక్తిని పాటించిన గంగాధర్ గుప్తా ఆ కొందరినూ ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 20 కోట్లు ఖర్చుపెట్టి ఆసుపత్రి నిర్మించడం ఒక ఎత్తు..అయితే, దాని నిర్వహణకు నెలకు దాదాపు 30 లక్షల రూపాయలు వెచ్చించడం మరో ఎత్తు.
ఇంత ఖర్చు చేస్తున్న గంగాధర్ కు సొంత ఇల్లు లేదు. అద్దె ఇంట్లోనే ఉంటున్న గంగాధర్…తన ఇద్దరబ్బాయిలనూ తన బాటలోనే నడిపిస్తున్నారు. కుటుంబ వ్యాపారం మీద వచ్చే ఆదాయాన్ని హాస్పిటల్ కోసమే ఈ కుటుంబం అంతా వెచ్చిస్తోంది. హుండీలో పేషెంట్లు వేసిన ఒక్క రూపాయిని సైతం ముమ్మిడివరంలోని బాలయోగీశ్వర ఆశ్రమానికి అందజేయడం గంగాధర్ కుటుంబం గొప్పదనం. వేల కోట్ల ఆస్తులున్న వారు సైతం తమ వ్యాపారాలు మరింత విస్తరించి మరిన్ని కోట్లు సంపాదించాలని చూస్తున్న ఈ రోజుల్లో…తనకున్న కొద్దిపాటి ఆస్తిని ఈ రకంగా సమాజం కోసం ఉపయోగిస్తున్న గంగాధర్ గుప్తా దాన వీర శూర కథ ఎందరికో స్ఫూర్తి దాయకం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
జీజీ హాస్పిటల్, రామ్ నగర్, హైదరాబాద్ (ఫోన్. నం 8977917200, 8977917300)