దేశంలో లక్షలాది కేసులు పెండింగ్ ఉన్నాయి. క్యాలెండర్ లో తేదీ మారే ప్రతిసారీ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. పెరిగే కేసులకు తగ్గట్లు న్యాయస్థానాలు ఏర్పాటులో నిర్లక్ష్యం.. న్యాయమూర్తుల ఎంపికలో జరిగే ఆలస్యం న్యాయం సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతోంది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న కేసులకు సైతం దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే వస్తుంది.
ఉత్తరప్రదేశ్ లోని ఒక కేసును చూస్తే.. ఇంత చిన్న నేరానికి సంబంధించిన తీర్పు ఇంత ఆలస్యంగానా? అన్న సందేహం కలగొచ్చు. 1998 ఏప్రిల్ 17న యూపీలోని ఛపట్టీ ప్రాంతానికి చెందిన వీరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లైంట్ సారాంశం ఏమంటే.. తన జేబులోని రూ.45ను ఇటావాలోని భూరా ప్రాంతానికి చెందిన మన్నన్ అనే వ్యక్తి దొంగలించాడని పేర్కొన్నారు.
దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అతడి వద్ద ఉన్న రూ.45 స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎదుట హాజరుపర్చగా.. సదరు నిందితుడ్ని జైలుకు పంపారు. ఈ చోరీ కేసులో నిందితుడు మన్నన్ ఏకంగా రెండు నెలల 21 రోజులు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. అలా మొదలైన ఈ కేసు నేటికి పూర్తి కాలేదు.
అతడ్ని విచారణకు హాజరు కావాలని కోర్టు నుంచి సమన్లు పంపినా అవి మాత్రం అతడికి చేరలేదు. ఇదిలా ఉంటే.. ఈ కేసు నుంచి బయటపడేందుకు మన్నన్ గత నెల 28న కోర్టు ఎదుట హాజరై తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో.. అతడికి నాలుగు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఒక చిన్న దొంగతనం కేసు దశాబ్దాల తరబడి సాగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.