గాడ్ ఫాదర్ చిత్ర ప్రమోషన్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. ఏమో…భవిష్యత్తులో జనసేనకు మద్దతిస్తానేమో…అంటూ ‘తమ్ముడు’ పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా ‘అన్నయ్య’ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపుతున్నాయి. చిరు అన్న పెద్దమాట..కచ్చితంగా జనసైనికులలో, మెగా ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి కామెంట్లపై మెగా బ్రదర్, జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు స్పందించారు.
పవన్ పగ్గాలు చేపట్టాలని, తమ్ముడి ఆశయం నెరవేరాలని చిరంజీవి ఆకాంక్షించారని, కచ్చితంగా అది నెరవేరుతుందని నాగబాబు అన్నారు. జనసైనికులంతా ఆ కార్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తామని, చిరంజీవి మాట కోట్లాది మంది తమ్ముళ్ల మనసులను గెలుచుకుందని చెప్పారు. అన్నయ్య చెప్పిన మాటలకు అనుగుణంగా జన సైనికులు, వీర మహిళలు మరింత శ్రమించి ప్రజల మన్ననలు పొందాలని నాగబాబు పిలుపునిచ్చారు.
మరోవైపు, వైసీపీ ప్రభుత్వంపై నాగబాబు తన విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నారు. ‘Just asking…? ప్రభుత్వ ఆధీనంలో ఉండే temples యొక్క ఆదాయం Endowments department వెల్తే.. మరి ఈ ప్రైవేట్ గుడి యొక్కఆదాయం ఎవరికి వెల్తుంది.. Let me know your answers..’అంటూ నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక జనసైనికుడు ఈ ప్రశ్న అడగడంతో నాగబాబు దానికి సంబంధించిన సమాధానం తెలిసిన వారు చెప్పాలంటూ ట్వీట్ చేశారు.