టీడీపీ మాజీ నేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ దసరా నాడు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించి ఉండాలన్న నిబంధన ఉంది. దీంతో, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ వేలు పెట్టేందుకు కేసీఆర్ సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీలలో పోటీ చేయడం వల్ల జాతీయ పార్టీకి కావాల్సిన అర్హత సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారట.
ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషన్ ఉండవల్లి అరుణ్ కుమార్ తో కేసీఆర్ భేటీ అయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కొందరు టీడీపీ నేతలకు గాలం వేసేందుకు కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారని టాక్ వస్తోంది. అంతేకాదు, కేసీఆర్ జాతీయ పార్టీకి ఏపీ ఇన్చార్జిగా ఉండవల్లి అరుణ్ కుమార్ ను నియమించబోతున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకప్పటి టిడిపి నేత ఆయన కేసీఆర్… గతంలో పార్టీలో పనిచేసినప్పుడు తనకున్న పరిచయాలను జాతీయ పార్టీ కోసం వాడుకునేందుకు రెడీ అవుతున్నారట.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలకు చెందిన టిడిపి నేతలపై కేసీఆర్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా కేసీఆర్ పార్టీకి బీఆర్ఎస్ అనే పేరు ఖరారైందని, బీఆర్ఎస్ లో చేరాలంటే కొందరు ఏపీ టీడీపీ నేతలకు కేసీఆర్ ఆఫర్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఇటీవల జగన్ సర్కార్ ను, వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ హరీష్ రావు చేసిన కామెంట్లు కూడా కేసీఆర్ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.