2024 అసెంబ్లీ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జగన్ పాలనపై జనం విసిగిపోయారని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా టీడీపీ నేతలు తీసుకువెళ్లాలని అధినేత చంద్రబాబు…నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మాదిరి కాకుండా పక్కా ప్రణాళికతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
గతంలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను చివరి నిమిషం వరకు చంద్రబాబు వెల్లడించేవారు కాదు. అయితే, ఈ రకంగా చేయడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని గ్రహించిన చంద్రబాబు ఈసారి రూట్ మార్చారు. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల పార్టీ అభ్యర్థుల పేర్లు ఇప్పటి నుంచే ప్రకటించడం మొదలు పెట్టిన చంద్రబాబు తాజాగా ఆ దిశగా మరింత జోరు పెంచారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలతో కొద్దిరోజులుగా చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మొదటిరోజు రెండు, మూడు నియోజకవర్గాల ఇన్చార్జిలతోనే భేటీ అయిన చంద్రబాబు…తాజాగా ఆ సంఖ్యను పెంచారు. గురువారం నాడు ఏకంగా 6 నియోజకవర్గాల ఇన్చార్జిలతో చంద్రబాబు విడివిడిగా భేటీ కావడం విశేషం. విజయవాడ ఈస్ట్, చీపురుపల్లి, రాయదుర్గం, సాలూరు, ఎర్రగొండపాలెం, మచిలీపట్నం నియోజకవర్గాల ఇన్చార్జిలతో చంద్రబాబు సమావేశం అయ్యారు.
గురువారంనాడు పూర్తయిన భేటీలతో కలుపుకుంటే మొత్తం 71 నియోజకవర్గాల ఇన్చార్జిలతో చంద్రబాబు మీటింగ్ పూర్తయినట్లయింది. మరికొద్ది రోజుల్లోనే మిగిలిన నియోజకవర్గాల ఇన్చార్జిలతో చంద్రబాబు సమావేశాలు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు జోరు చూస్తుంటే జగన్ ఓటమి ఖాయమని టీడీపీ నేతలు, కార్యకర్తలు పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జోరుతో టీడీపీ క్యాడర్ లో జోష్ వచ్చింది.