అధికారం చేతిలో ఉంటే సరిపోదు. దానికి తగ్గట్లుగా మాటలు ఉండాలి. అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఏ మాత్రం మంచిది కాదు. తాజాగా ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటమే కాదు…ఆ మాత్రం దానికే అన్నేసి మాటలు అనటమా? అన్న ఆగ్రహం కలుగక మానదు. తాను మాట్లాడే వారంతా స్కూల్ పిల్లలని.. వారి సమస్యల్ని సహానుభూతితో అర్థం చేసుకోవాలే తప్పించి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడ కూడదన్న చిన్న విషయాన్ని ఆమె మిస్ అయ్యారు. ఇంతకూ ఆ మహిళా ఐఏఎస్ అధికారిణి ఎవరు? ఏమన్నారు? అన్న విషయాల్లోకి వెళితే..
బిహార్ మహిళా ఐఏఎస్ అధికారిణి హర్ జోత్ కౌర్. ప్రస్తుతం ఆమె బిహార్ ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమె స్కూలుకు వెళ్లిన సందర్భంగా అక్కడ చదువుకుంటున్న విద్యార్థినులు.. ప్రభుత్వం ఎన్నింటినో ఉచితంగా ఇస్తోందని.. రూ.20-రూ.30 విలువ చేసే శానిటరీ నాపిక్స్ ను ఉచితంగా ఇస్తే బాగుంటుంది కదా? ఆ మాత్రం మాకు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన ఆమె.. తన స్థాయికి ఏ మాత్రం సూట్ కాని వ్యాఖ్యల్ని చేశారు. ‘కోరికలకు ఒక అంతు అనేది ఉందా? ఈ రోజు శానిటరీ నాప్ కిన్స్ ఉచితంగా అడుగుతున్నారు. ఇలాగే ఇచ్చుకుంటూ పోతే చివరకు కుటుంబ నియంత్రణ మాటకు వస్తే.. కండోమ్స్ కూడా ఫ్రీగా అడుగుతారు’ అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో.. స్కూల్ విద్యార్థినులు బిత్తర పోయే పరిస్థితి.
శానిటరీ నాప్ కిన్స్ ను ఫ్రీగా అడిగితే.. ఇంతలా మాట్లాడిన మాటలతో షాక్ తిన్న విద్యార్థినులు తగ్గకుండా.. ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇస్తారు కదా? అన్న ప్రశ్నను సంధిస్తే.. దీనికి హర్ జోత్ కౌర్ మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ‘ఓట్లు వేయకండి.. పాకిస్థాన్ లా మారిపోండి’ అంటూ గయ్యిమన్నారు. ఏమైనా.. కీలక పదవుల్లో ఉన్న అధికారులు ఇలా మాట్లాడటం ఏ మాత్రం సరికాదన్న విషయాన్ని ఆమె ఎప్పటికి తెలుసుకుంటారో?