తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నాడు తెలుగు దేశం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తెలుగు నేలకు చెందిన నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా స్థానిక పార్టీల సత్తా ఏమిటో చాటి చెప్పిన ఘనత అన్నగారిదేనని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలుగోడి సత్తాను గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేలా చేసిన కథానాయకుడు..మహానాయకుడు ఎన్టీవోరే.
అందుకే, పార్టీలకతీతంగా ఎన్టీఆర్ ను చాలామంది రాజకీయ నాయకులు అభిమానించి గౌరవిస్తుంటారు. ఆయనకు సంబంధించిన విషయాలలో రాజకీయాలకు అతీతంగా స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు నేపథ్యంలోనూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నారు. ఈ సమయంలోనే అన్నగారి గొప్పదనాన్ని పలువురు రాజకీయ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ ఛైర్మన్ ఈవన సాంబశివ ప్రతాప్ గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రాలలో ప్రతీ పట్టణంలో అర్టీసీ భవనాలు నిర్మించి ఆ సంస్థకు సొంత అస్తులు ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని ఆయన చెప్పారు. ఆనాడు ముందుచూపుతో ఆర్టీసీ కోసం అన్నగారు కొన్ని ఆస్తుల విలువ నేడు వేల కోట్లలో ఉందని చెప్పారు. పాలనను ప్రజలకు చేరువ చేయడం కోసం మండల వ్యవస్థ ఏర్పాటు చేశారని, భూముల లెక్కలపై కరణం, మునసబు, పటేల్, పట్వారీల పెత్తనం లేకుండా ప్రభుత్వ అజమాయిషీలోకి తెచ్చారని గుర్తు చేశారు.
ఇక, మహిళలకు అస్తిలో హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని చెప్పారు. తెలుగు సంస్కృతి, చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేందుకు ట్యాంక్ బండ్ చుట్టూ తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులు, చరిత్రకారులు, వాగ్గేయకారుల విగ్రహాలను ఏర్పాటు చేయించారని గుర్తు చేసుకున్నారు. నిజాయితీ పరులైన, విద్యావంతులైన బడుగు, బలహీన, కాపు వర్గాల యువతకు రాజకీయ అవకాశాలు కల్పించారని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్టీఆర్ అంటే పేరు కాదు..అదో బ్రాండ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.