డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును పెట్టాలన్న జగన్ ఆలోచనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వంపై టీడీపీ సహా విపక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పేరు మార్పు వ్యవహారంపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే.
అయితే, ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ గొప్పవారేనంటూ తారక్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నాయి. తన తాత ఎన్టీఆర్ కు మద్దతుగా ఉండాల్సిన జూనియర్ ఎన్టీఆర్…వైఎస్ ను కూడా కీర్తించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పేరు తీసేయడం వల్ల ఆయన ఖ్యాతి తగ్గదు అన్నట్టుగా తారక్ కామెంట్ చేయడంపై ఎటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. డిప్లమాటిక్ గా తారక్ వ్యవహరించడాన్ని చాలామంది ఎన్టీఆర్ అభిమానులు తప్పుపడుతున్నారు.
గోడమీద పిల్లి లాగా తారక్ మాట్లాడారని, ఇటువంటి సమయంలో తన తాతకి తారక్ సపోర్ట్ చేసి ఉండాల్సిందని చాలామంది అంటున్నారు. వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జూనియర్ ఎన్టీఆర్ ఇలా వ్యాఖ్యానించడంపై పెను దుమారం రేగుతోంది. చంద్రబాబుపై కోపంతోనే తారక్ ఇలా మాట్లాడారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పేరు మార్పు వివాదం కన్నా ఆ వ్యవహారంపై తారక్ స్పందించిన తీరు మరింత వివాదాస్పదం కావడం విశేషం.