హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈనెల 25న జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆఫ్ లైన్ లో 3000 టికెట్లు అందుబాటులో ఉండగా…వాటికోసం దాదాపు 30 వేల మంది అభిమానులు స్టేడియం దగ్గరకు చేరుకున్నారు. గంటకు రెండు వందల టికెట్లు కూడా విక్రయించకపోవడంతో అభిమానులంతా ఆందోళన చెందారు.
దీంతో, పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ క్రమంలోనే అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 20 మంది అభిమానులు, కొందరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ మహిళ చికిత్స పొందుతూ మరణించిందని తెలుస్తోంది.
లాఠీ చార్జి సందర్భంగా జనం ఒక్కసారిగా పోలీసుల మీద పడడంతో ఒక కానిస్టేబుల్ కు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల లాఠీచార్జి సందర్భంగా పలువురు అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. అభిమానులను అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన పనిగా మారింది. దీంతో, స్టేడియం వద్దకు అదనపు బలగాలను మోహరించారు. ఈ తొక్కిసలాట నేపథ్యంలో టికెట్ కౌంటర్లను మూసివేశారు.
ఉదయం 10 గంటల నుంచి కౌంటర్లలో టిక్కెట్లు విక్రమయిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం నిన్న రాత్రి ప్రకటించింది. దీంతో, తెల్లవారుజామున 3 గంటల నుంచే వేల సంఖ్యలో అభిమానులు కిలోమీటర్ల మేర స్టేడియం ముందు క్యూ కట్టారు. జింఖానా గేటు నుంచి ప్యారడైజ్ సిగ్నల్ వరకూ వేలాది మంది బారులు తీరడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది.
అయితే, ఉదయం 11.30 దాటినా కూడా కౌంటర్లు ప్రారంభించకపోవడం, కేవలం మూడు వేల టిక్కెట్లు మాత్రమే ఇస్తామని ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు చేరుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అంతేకాదు, కొందరు అభిమానులు గేట్లు తోసుకొని, గోడలు దూకి గ్రౌండ్లోకి దూకేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో అక్కడ పరిస్థితి అదుపుతప్పింది.