ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు అమరావతిపై విషయం చిమ్మడమే లక్ష్యంగా జగన్ ముందుకు పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతికి సంబంధించి కీలక పాత్ర పోషించిన టీడీపీ నేతలపై కూడా జగన్ కక్షగట్టారు. ఈ నేపథ్యంలోనే అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ పురపాలక శాఖా మంత్రి పొంగూరి నారాయణపై గతంలో కేసులు నమోదయ్యాయి.
అయితే, సత్యమేవ జయతే అన్న రీతిలో ఆలస్యమయినప్పటికీ ఈ కేసులనుండి నారాయణకు ఒక్కొక్కటిగా ఉపశమనం లభిస్తోంది. ఈ కేసులకు సంబంధించి ఇటీవల నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు…అమెరికాలో వైద్య చికిత్స చేయించుకునేందుకు కూడా కొన్ని సడలింపులు ఇచ్చింది. ట్రీట్ మెంట్ కోసం నారాయణ అమెరికా వెళ్లి వచ్చేందుకు హైకోర్టు 3 నెలల సమయాన్ని కేటాయించింది.
కానీ, నారాయణ అమెరికాకు వెళ్లేందుకు గతంలో సీఐడీ ఆయనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు అడ్డంకిగా మారాయి. దీంతో నారాయణకు ముందస్తు బెయిల్ లభించినా, ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద క్లియరెన్స్ పొందేందుకు లుకౌట్ నోటీసులు ప్రతిబంధకంగా మారాయి. దీంతో, నారాయణ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై లుకౌట్ నోటీసుల అంశాన్ని సమీక్షించాలని కోరారు.
ఈ నేపథ్యంలో నారాయణ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరిపి కీలక ఆదేశాలిచ్చింది. నారాయణపై జారీ అయిన లుకౌట్ నోటీసులను ఎత్తివేయాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 22 నాటికి అమెరికా నుంచి నారాయణ తిరిగి రావాలని స్పష్టం చేసింది.