కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఏపీ రాజకీయాల్లోకి ఎంటరవుతున్నారా ? ఆమె మాటలను బట్టి అందరికీ ఇదే అర్ధమవుతోంది. అమరావతి పరిరక్షణ సమితి పాదయాత్ర ప్రారంభం సందర్భంగా రేణుక తుళ్ళూరుకు వచ్చి చాలా హడావుడి చేశారు. ఆ హడావుడిలో జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. దానికి మాజీమంత్రి కొడాలినాని గట్టిగానే కౌంటరిచ్చారు. ఆ సందర్భంగా కొడాలి మాట్లాడుతూ కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకకు అసలు ఏపీ రాజకీయాల్లో ఏమిపనంటు ఎద్దేవాచేశారు.
ఇపుడీ విషయంపైనే రేణుక మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో గుడివాడలోనే ఎంఎల్ఏగా పోటీచేస్తానని ప్రకటించారు. తాను గుడివాడలో ఎంఎల్ఏగా పోటీచేస్తే కొడాలి ఎలా గెలుస్తారో చూస్తానంటు చాలెంజ్ చేశారు. అయితే తాను ఏ పార్టీ తరపున పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం చెప్పలేదు. తనకు టీడీపీ అవసరం లేదని చెప్పారు కాబట్టి ఆమె తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడం లేదని పరోక్షంగా చెప్పినట్లయ్యింది.
ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున గనుక రేణుక పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చేది కూడా అనుమానమే. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని జనాలు వందడుగుల లోతున గొయ్యితవ్వి సమాధి చేసేసిన విషయం అందరికీ తెలిసిందే. అడ్డుగోలు రాష్ట్ర విభజన చేసిందన్న మంట కాంగ్రెస్ పై జనాల్లో బాగా ఉంది. ఈ కారణంగానే రెండు వరుస ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కటం లేదు.
ఈ విషయం తెలిసి రేణుక ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఎవరు అనుకోవడం లేదు. ఒకవేళ నిజంగానే గుడివాడలో పోటీచేస్తే ఆమె సత్తా ఏమిటో జనాలందరికీ తెలుస్తుంది. అసలు రేణుకకు ఏపీ రాజకీయాల్లో ఎక్కడా బేస్ అన్నదే లేదు. ఆమె కార్పొరేటర్ గా, ఎంపీగా గెలిచిందంతా తెలంగాణాలోనే. ఆమె రాజకీయ జీవితం మొదలైంది, కంటిన్యు అవుతున్నదంతా తెలంగాణాలోనే. కాబట్టి ఏదో బెదిరింపుల కోసం రేణుక గుడివాడలో పోటీచేస్తానని చెప్పినట్లుగానే అనుకుంటున్నారు. చూద్దాం చివరకు ఏమవుతుందో.