రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పై నానాటికీ వ్యతిరేకత పెరిగిపోతుందన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఎడ్లబండ్లను లాగుతున్న ఎడ్లను కూడా పోలీసుల అరెస్టు చేయడంతో..కాడెద్దులుగా మారి టీడీపీ నేత లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు అసెంబ్లీ వరకు నిరసన వ్యక్తం చేయడం వైరల్ గా మారింది.
ఇక, ఎద్దులను సైతం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లడం, ఎద్దుల బండి ఇచ్చిన రైతును సిఐ కొట్టడం వంటి ఆరోపణలు కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు మరో మారు పలువురు టీడీపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో వారంతా అసెంబ్లీ సమీపంలోని భవనం పైకి ఎక్కి నిరసన చేపట్టారు. ఆ భవనం పై ఆందోళన కార్యక్రమం టీడీపీకి చెందిన కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నేతలు ఉన్నారు.
జగన్ దళిత ద్రోహి అంటూ వారంతా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా ఆ భవనం పైనుంచి కిందకు దించి వేశారు. వారందరినీ అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఏది ఏమైనా టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి వరుసగా నిరసనలు ఎదురుకోవడం, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు జరగడంతో జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడిందని ప్రచారం జరుగుతోంది. జగన్ పై ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయని చెప్పేందుకు ఈ ఘటనలు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.