గత ఎనిమిదేళ్లుగా దేశవ్యాప్తంగా బీజేపీ హవా సాగుతున్న సంగతి తెలిసిందే. 2014లో ప్రధాని మోడీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దేశం మొత్తం కాషాయీకరించాలని బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం బలహీనంగానే ఉందని చెప్పాలి. అందుకే 2019 ఎన్నికల తర్వాత దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ అగ్రనేతలు గట్టిగా ఫోకస్ చేస్తున్నారు.
కర్ణాటక మినహా కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పాగా వేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో తనకున్న ఓటు బ్యాంకును మరింత పెంచుకునేలా బీజేపీ అగ్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను బిజెపిలోకి ఆహ్వానించడంలో అమిత్ షా సక్సెస్ అయ్యారు. ఇక, తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న సందేశాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళేందుకు బీజేపీ అగ్ర నేతలు సైతం తెలంగాణలో పలుమార్లు పర్యటించారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీకి సినీ తారల మద్దతు కూడాగట్టేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరోను అమిత్ షా టార్గెట్ చేశారు. టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ తో ఈనెల 16న అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు.
సెప్టెంబర్ 17వ తేదీన జరిగే తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు హాజరుకాబోతున్న అమిత్ షా అందుకు ఒకరోజు ముందే ప్రభాస్ తో సమావేశం కానున్నారు. అంతేకాదు, సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం దివంగత సినీ నటుడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. గతంలో బీజేపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన కృష్ణంరాజు కేంద్రం మంత్రిగా కూడా పనిచేశారు.
ఈ క్రమంలోనే కృష్ణంరాజు నట వారసుడిగా ఓ వెలుగు వెలుగుతున్న ప్రభాస్ ఆయన రాజకీయ వారసుడిగా కూడా బీజేపీకి మద్దతు ఇస్తాడేమోనని ప్రచారం జరుగుతుంది. ఆ విషయంపై మాట్లాడేందుకే ప్రభాస్ తో అమిత్ షా ప్రత్యేకంగా ప్రత్యేకంగా భేటీ అవుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రభాస్ ఏనాడు రాజకీయాల జోలికి పోయింది లేదు. కనీసం పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. మరి అటువంటి ప్రభాస్ బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు అమిత్ షా ఒప్పిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణ బీజేపీకి సినీ గ్లామర్ తెచ్చేందుకు అమిత్ షా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వస్తుంది.
Comments 1