కొందరు రాజకీయ నేతలు ఎన్నికల్లో గెలుపునకు పొంగిపోతుంటారు….ఓటమికి అదే స్థాయిలో కుంగిపోతుంటారు. కొందరు నాయకులు విజయ దరహాసంతో గులాములు చల్లుకోవడాన్ని ఆస్వాదించినంతగా…పరాయజయపు మందహాసాన్ని జీర్ణించుకోలేరు. అటువంటి నాయకులు పార్టీ అధినేతలుగా ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు, కేడర్ మరింత అధైర్యానికి గురై పార్టీ నిర్వీర్యం అయిన సందర్భాలు కోకొల్లలు.
అయితే, టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాత్రం అటువంటి నాయకుల జాబితాలో లేరని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. ఆ మాటకొస్తే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు…..అతడే ఒక సైన్యం. అధికార పక్షంలో ఉన్నా…ప్రతిపక్షంలో ఉన్నా…గెలుపు కవ్వించినా…ఓటమి వెక్కిరించినా…మొక్కవోని స్థిత ప్రగ్నత ప్రదర్శించడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందంటే అతిశయోక్తి కాదు.
ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార పక్షం అక్రమాలు, బెదిరింపులకు పాల్పడి విజయం సాధించి జబ్బలు చరుచుకుంటున్న నేపథ్యంలో కార్యకర్తలకు చంద్రబాబు మనోధైర్యాన్నిచ్చారు. ఇటు అధికారాన్ని అటు పోలీసులను అడ్డుపెట్టుకొని వైసీపీ గెలిచినా…అది గెలుపు కాదని, టీడీపీ కేడర్ అంతా స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారని చంద్రబాబు కితాబిచ్చారు.
ప్రాణాలు కూడా పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారని, కార్యకర్తల పోరాటస్ఫూర్తికి వందనాలంటూ చంద్రబాబు ఉద్విగ్నతకు లోనయ్యారు. ఫలితాలను చూసి నిరుత్సాహ పడొద్దని, రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలతో అధికార పార్టీ అడ్డగోలుగా వ్యవహరించిందని, అయినప్పటికీ గట్టిగా పోరాడామని ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదేనని చంద్రబాబు కేడర్ లో ధైర్యం నింపారు.
యాక్టివ్ గా ఉన్న నేతలు, కేడర్ నే కాదు….కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కూడా చంద్రబాబు ధైర్యం చెప్పారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బొజ్జలను చంద్రబాబు పరామర్శించారు.
“గోపాల్ నీకేం కాదు… ధైర్యంగా ఉండు. నువ్వు తప్పకుండా కోలుకుని ఇంటికి వస్తావు. ఈసారి మీ ఇంటికి వచ్చి నిన్ను కలుస్తాను” అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు బొజ్జలకు కొండంత బలాన్నిచ్చాయి. ఉల్లాసంగా మాట్లాడిన చంద్రబాబు….నీకేం కాదు…నీకు అండగా నేనుంటా…అంటూ బొజ్జలను ఉత్సాహ పరిచారు. బొజ్జల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.