విశాఖలో నేడు అగ్నిపథ్ నియమాకాలు ప్రారంభం అయ్యాయి. త్రివిధ దళాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన సైనికులుగా యువతను చేర్చుకునే ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే లక్షల మంది యువకులు దేశ వ్యాప్తంగా ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. అగ్నిపథ్ వద్దని ఆందోళనలు రేగిన తరుణాన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలు రేగాయి. కోట్లలో ఆస్తి నష్టం అన్నది ఆవేళ సంభవించింది. ఇప్పటికీ నాటి కేసుల్లో ఇరుక్కున్న యువకులు ఎవ్వరూ బెయిల్ కూడా పొందని విధంగా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయింది. అగ్నిపథ్ లో భాగంగా నయా వీరుల నియామకం కోసం ఆర్మీ ర్యాలీ అన్నది చేయడం తథ్యం అని తేల్చేసింది. ఇందులో భాగంగా త్రివిధ దళాలకు సంబంధించి ఆసక్తి ఉన్న యువకులు స్పందించారు. ఆర్మీలో చేరి తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నవారం
వాస్తవానికి సికింద్రాబాద్ ఘటన తరువాత కేంద్రం నుంచి స్పష్టమయిన ప్రకటన వచ్చింది. పాత ర్యాలీల కథను మరిచిపోవాలి అని చెప్పకనే చెప్పింది కూడా! అంటే ఇకపై దేశానికి సారథ్యం వహించే త్రివిధ దళాలలో కాంట్రాక్టు ప్రాతిపదికనే నియామాకాలు చేపట్టి తరువాత ఆర్థిక భారం తగ్గించుకోవాలని కూడా కేంద్రం భావిస్తోంది. అగ్నిపథ్ లో నియామకం అయి శిక్షణ పొందినవారిలో వారి పనితనం అనుసరించి తరువాత కొన్ని పరీక్షలు అన్నవి నిర్వహించాక పూర్తి స్థాయి జాబ్ హోల్డర్స్ గా వారిని తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా కేంద్రం తేల్చేసింది.
దీంతో అప్పట్లోరేగిన అశాంతి కాస్త తగ్గింది. అసలు ఏ ఉద్యోగం లేకుండా ఊళ్లలో తిరిగే కన్నా దేశానికి సేవ చేస్తూ సుశిక్షితులయ్యే అవకాశం ఎందరికి వస్తుందని, కొన్ని దేశాలలో ఆర్మీలో యువత విధులు నిర్వర్తించే విధానం అన్నది తప్పనిసరి అయి ఉంటుందని, కనుక అగ్నిపథ్ విషయంలో ఆందోళనలకు తావేలేదన్న వాదన కూడా వినిపించింది.
ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ (అగ్నిపథ్) ప్రారంభం అయి సంబంధిత వర్గాల్లో కాస్త ఊరటనిచ్చింది. వేల సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి చేరుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 350 మందికి పైగా అధికారులు, 500 మందికి పైగా పోలీసులు ఈ ప్రారంభ నోటిఫికేషన్ కు సంబంధించి నిర్వహిస్తున్న ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు.