నిన్న సాయంత్రం తెలంగాణ బీజేపీపై ఒంటికాలిపై లేచి విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీలో వచ్చిన మున్సిపల్ ఫలితాలు, కార్పొరేషన్ ఫలితాలపై స్పందించారు. ఇది నిజమైన గెలుపు కాదన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చి సాధించిన గెలుపు కాదు, ఇది బెదిరింపుల గెలుపు అని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
అత్యధిక మున్సిపాలిటీలు, మొత్తం కార్పొరేషన్లు వైసీపీ దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఒక జనసేన ఊసే ఎక్కడా లేదు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తప్ప జనసేన పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
వైకాపా విజయాలు నిజమైనవి కావు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఓటు వెయ్యకపోతే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని, ఇంటి స్థలం ఇవ్వమని బెదిరించి భయపెట్టారు. కడుపుమీద కొట్టి తిండి లాక్కుంటామని బెదిరించి ఓట్లు సాధించిందని పవన్ ఆరోపించారు. వైసీపీ బెదిరింపులకు బలంగా బదులిస్తామని పవన్ స్పష్టం చేశారు.
జనసేన… తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 5 వార్డులను గెలిచింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో నాలుగు స్థానాల్లో గెలిచింది. ఒంగోలు కార్పొరేషన్లో ఒకటి గుంటూరు కార్పొరేషన్లో ఒక డివిజన్ ను జనసేన దక్కించుకుంది. పవన్ ఓటేసిన చోట టీడీపీ గెలిచింది.