స్టైలీష్ స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్ ఇమేజ్ ను ఆకాశానికి ఎత్తేసిన మూవీ పుష్ప. తగ్గేదెలే అన్నట్లుగా ఈ సినిమా తర్వాత అతడు అస్సలు తగ్గట్లేదు. ఒక వేళ తగ్గుదామని అనుకున్నా.. తగ్గితే ఒప్పుకునేదే లేదని అభిమానులు తేల్చి చెబుతున్నారు. అతగాడి క్రేజ్ ఇప్పుడెంతలా పెరిగిపోయిందో తెలిసిందే.
ఇలాంటి వేళ.. అభిమానులు తమ మీద చూపిస్తున్న అభిమానానికి తగ్గట్లే బన్నీ తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయి. తాజాగా అతగాడికి పెరిగిన క్రేజ్ ను పరిగణలోకి తీసుకున్న ఒక వాణిజ్య సంస్థ అతనికి భారీ ఆఫర్ ఇచ్చింది.
సినిమాలతో పాటు.. పలు ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసే అల్లు అర్జున్ కు పొగాకు ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేసే సంస్థ అతనికి భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఒక రోజు షూటింగ్.. అది కూడా కొన్ని గంటల పాటే. ఈ ఆఫర్ ను ఓకే చేస్తే రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామంటూ షాకింగ్ ప్రపోజల్ పెట్టారట.
అభిమానులను ద్రష్టిలో పెట్టుకున్న బన్నీ.. ఆ ఆఫర్ కు సింఫుల్ గా నో చెప్పారట. తాను పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేసేలా నటిస్తే.. తన అభిమానులు తనను ఫాలో అయితే వారి ఆరోగ్యం దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో నో చెప్పినట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం తాను చేస్తున్న బ్రాండ్లకు రూ.7.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్న అల్లు అర్జున్.. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే అతి కొద్ది మందిలో ఒకరుగా చెబుతున్నారు.
కోట్లకు కోట్లు ఇస్తామన్నా.. తాను చేసే బ్రాండ్ విషయంలో రాజీ పడేది లేదని బన్నీ చెబుతున్నాడట. తన అభిమానులకు ఎలాంటి నష్టం జరగని బ్రాండ్లకు మాత్రమే తాను ప్రచార కర్తగా ఉంటానని.. డబ్బుల కోసం వారికి చేటు చేసే వాటి జోలికి వెళ్లనని చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆ పొగాకు ఉత్పత్తుల సంస్థ ఏమో కానీ.. బన్నీకి భారీ ఆఫర్ ఇచ్చి అతగాడి ఇమేజ్ ను మరింత పెంచేలా చేసిందని చెప్పక తప్పదు. ఏమైనా.. రూ.10 కోట్లకు కక్కుర్తి పడని బన్నీని అభినందించాల్సిందే.