కర్ణాటక రాష్ట్రంతో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బీజేపీ మంత్రికి సంబంధించిన రాసలీలల సీడీలో కనిపించిన అమ్మాయి ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాకపోవటంతో తెలిసిందే. ఎంతలా ప్రయత్నించినా.. ఆమె ఆచూకీ బయటకు రాకపోవటం.. అజ్ఞాతంలో ఉండిపోయిన ఆమె అసలు ఉన్నారా? లేరా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ సీడీ వైరల్ అయిన తర్వాత చోటు చేసుకున్నరాజకీయ పరిణామాలతో కర్ణాటక రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న రమేశ్ జార్కిహోళి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సీడీలో మంత్రితో పాటు కనిపించిన సదరు యువతి తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు.
అందులో ఆమె తన గురించి.. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టారు. మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి తనకు ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చి.. తప్పారన్నారు. ఆ సీడీని ఆయనే విడుదల చేశారన్నారు. వీడియోను ఎవరు షూట్ చేశారో? ఎవరు తీశారు? ఎలా తీశారన్నది తనకు తెలీదని చెప్పిన ఆమె.. సీడీ కారణంగా తన మాన.. మర్యాదలకు భంగం వాటిల్లినట్లుగా పేర్కొన్నారు.
ఆవేదనతో తాను మూడు.. నాలుగుసార్లు ఆత్యహత్యాయత్నానికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు కూడా సూసైడ్ కు ప్రయత్నించారన్నారు. తన వెనుక ఎవరూ లేరని.. తనకు రాజకీయ మద్దతు కూడా లేదన్నారు.
ఉద్యోగం ఇప్పిస్తానని జార్జి మోసం చేశారని.. తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ఇదిలా ఉంటే.. ఈ సీడీ కేసులో ఏర్పాటైన సిట్ పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.