పీకే…ఈ పేరు వినగానే సినీ అభిమానులకు టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తుకు వస్తారు. కానీ, పీకే అన్నను రాజకీయ అభిమానులు వింటే మాత్రం రాజకీయ వ్యూహకర్త, ‘ipac’అధినేత ప్రశాంత్ కిషోర్ గుర్తుకు వస్తారు. 2014లో మోడీని పీఎం చేయడంలో , నితీశ్, జగన్, కేజ్రీవాల్ వంటివారిని సీఎంలను చేసిన ఘనత పీకేదేననడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదంతా పీకేలోని ఒక యాంగిల్ మాత్రమే.
తాజాగా 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మోడీ కరిష్మాకు ఎదురొడ్డి మరీ దీదీని గెలిపిస్తానని కంకణం కట్టుకొని బీజేపీకి చాలెంజ్ లు విసురుతున్నారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న పీకే తొలిసారి ఓ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకోవడం..అందులోనూ ప్రత్యర్థి పార్టీకి 100 సీట్లొస్తే తన పెట్టే బేడ సర్దుకొని ఐప్యాక్ కు ప్యాకప్ చెబుతానని బస్తీమే సవాల్ విసరడం వంటి వ్యవహారాలతో పీకేలోని మరో యాంగిల్ ఈ మధ్యే బయటకు వచ్చింది.
ఆ తర్వాత పంజాబీ సీఎం అమరీందర్ సింగ్ ఏకంగా పీకేకు కేబినెట్ హోదా కల్పించడం విమర్శలకూ తావిచ్చింది. త్వరలోనే పీకేను రాజ్యసభకు నామినేట్ చేయడం వంటి కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయినా పర్వాలేదులే….గొంగళి పురుగు కాల క్రమేణా సీతాకోకచిలుకగా మారినట్టు, గంగ…చంద్రముఖిగా మారినట్టు, రాజకీయ వ్యూహకర్తగా ఉన్న పీకే ఫుల్ టైం పొలిటిషియన్ గా మారుతున్నాడు అని జనం సరిపెట్టుకున్నారు.
అయితే, ఈ రెండే కాదు, పీకేలో ఉన్న మరో యాంగిల్…ఇప్పటివరకు ఎవరూ ఊహించని యాంగిల్ ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పీకేలో అద్భుతమైన క్రియేటివిటీ ఉందన్న సంగతిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీపై దాడి ఎపిసోడ్ కు పీకేనే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారని కామెంట్లు చేస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నేటి ఏపీ సీఎం…నాటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తి దాడి ఎపిసోడ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో పీకే మమతపై దాడి ఎపిసోడ్ ను రక్తికట్టించారని సెటైర్లు వేస్తున్నారు. ఆ దాడి వైసీపీనే చేయించిందని నాడు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ఘటన సింపతీ కొట్టేసిన జగన్…సీఎం అయ్యారని, అదే తరహాలో బెంగాల్ లో దీదీని మరోసారి గద్దెనెక్కించడానికి పీకే జగన్ పై దాడి తెలుగు వెర్షన్ ను బెంగాలీలో రీమేక్ చేశారని సెటైర్లు వేస్తున్నారు.
ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది పీకేనేనని,…ముందు తెలుగులో సినిమా తీసి అది హిట్ కావడంతో దానిని బెంగాలీలో రీమేక్ చేశాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పీకేలో దాగి ఉన్న దర్శకుడు ఎన్నికల సమయంలో బయటకు తొంగి చూస్తున్నాడని, ఇప్పటికే తెలుగులో కోడికత్తి ఎపిసోడ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పీకే త్వరలో బెంగాలీలోనూ హిట్ కొట్టాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఒక వేళ పీకే అంచనాలు తలకిందులై…దీదీ ఓడిపోతే పీకే ఐ ప్యాక్ కు ప్యాకప్ చెప్పి…బాలీవుడ్ సినిమాలలో క్లాప్, ప్యాకప్ అంటూ కొత్త కెరీర్ మొదలుపెడతారేమోనని ట్రోలింగ్ చేస్తున్నారు. మరి పీకే ఎక్కడ ప్యాకప్ అంటారో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదేమోనని సెటైర్లు వేస్తున్నారు.