ఎంత అరిచినా, గొంతు చించుకున్నా ప్రధాని నరేంద్ర మోడీ హవాను తెలంగాణ వాకిట నిలువరించే సాహసమే చేయలేకపోయారు కేసీఆర్. ఆ విధంగా ఫెయిల్ అయ్యారు. ఎంత అరిచినా, గీ పెట్టినా కూడా మోడీ ఏం చెప్పాలనుకున్నారో అదంతా చెప్పే వెళ్లారు. ప్రసంగంలో నీళ్లు, నిధులు, నియామకాల గురించి చెప్పే వెళ్లారు. వాటి కోసం ఇక్కడి నాయకులు చేసిందేం లేదని చెప్పే వెళ్లారు. తీవ్ర విమర్శలు లేకపోయినా సరే ! మోడీ ప్రసంగం ఆకట్టుకుంది. ఇదీ నిన్నటి విజయ సంకల్ప సభ సారాంశం.
ఇక కేసీఆర్ ఎంతగానో పరితపించిన విధంగా మోడీ వ్యతిరేకత అన్నది మీడియాలో ఫోకస్ కాలేదు. సొంత మీడియా మాత్రం ఆయన్ను పట్టించుకుంది కానీ మిగిలిన మీడియాలో అంతగా ఆకర్షణీయ ధోరణిలో రాలేదు. . ఇక మోడీ ప్రసంగంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తప్పక అధికారంలోకి రావాలన్న సంకల్పం ఒకటి కనిపించింది. తపన కూడా కనిపించింది. అందుకు తెలంగాణ నాయకులు కృషి చేయాలని చెప్పి, శ్రేణులకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. ఓ విధంగా మోడీ ఇక్కడకు వచ్చింది ఆపరేషన్ దక్షిణ్ కు ఆ పని మాత్రం బాగానే చేశారు.
వెళ్తూ వెళ్తూ హైద్రాబాద్ కు ఓ వరం ఇచ్చారు. ఇక్కడ ఆధునిక సాంకేతికతతో కూడిన సైన్స్ సిటీని ఇస్తానని మాట ఇచ్చి వెళ్లారు. కరోనా అనుభవాల నేపథ్యంలో సైన్స్ ప్రాధాన్యం ఎంతన్నది చెప్పకనే చెప్పి వెళ్లారు. మోడీ సభకు దీటుగా నిన్నటి వేళ కేసీఆర్ జలవిహార్ లో ఏర్పాటు చేసిన సభ ఎప్పటిలానే సాగింది. అయితే కేసీఆర్ చెప్పిన మాటలన్నీ గతంలో చెప్పినవే కనుక స్పీచ్ లో ఎఫెక్టివ్నెస్ లేకుండా పోయింది.
కేసీఆర్ ఎంచుకున్న స్టాండ్ కూడా ఈ సారి పెద్దగా క్లిక్ కాలేదు. చాలా మంది ఇప్పటికిప్పుడు మోడీని ఎదిరించి సాధించింది ఏమీ లేకపోయినా 2029 నాటికి ఈ కష్టం ఫలిస్తుందని మాత్రం అంటున్నారు. కేసీఆర్ కు ఉన్న పుస్తక జ్ఞానం కూడా అందుకు ఉపయోగపడుతుంది అని, కానీ ఇవాళ మోడీ నగరంలోకి వచ్చిన వేళ ఫ్లెక్సీల రాజకీయం ఆయన హోదాకు తగ్గ ప ని కాదని, అదేవిధంగా బై బై మోడీ అనే డిజిటల్ ఉద్యమ ప్రభావం కూడా ఏమీ ఉండదని, గతంలో ఇలానే చంద్రబాబు కూడా ఇదే తప్పిదం చేశారని గుర్తుచేస్తున్నారు కొందరు సీనియర్ జర్నలిస్టులు.