ఇపుడిదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. తనపై కేసీయార్ ఎన్ని విమర్శలు చేసినా నరేంద్ర మోడీ దేన్నీ పట్టించుకోలేదు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మోడి మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. మోడీ వచ్చిన రోజునే నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా కూడా వచ్చారు. సిన్హాను రిసీవ్ చేసుకున్న తర్వాత కేసీయార్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆ సమావేశంలో మోడీపై కేసీయార్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన ఆరోపణలే చేశారు. మోడీ వ్యవహారశైలిని కూడా తప్పుపట్టారు. విచిత్రం ఏమిటంటే తనపై కేసీయార్ అన్ని ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా మోడీ ఒక్క విషయంలో కూడా రిప్లై ఇవ్వలేదు. బహిరంగ సభ సందర్భంగా కేసీయార్ కు మోడీ గట్టి రిప్లై ఇస్తారని అందరు అనుకున్నారు.
అయితే బహిరంగ సభలో సుమారు 15 నిమిషాలు మాట్లాడిన మోడీ కేసీయార్ లేవనెత్తిన అంశాల్లో దేనికీ సమాధానం చెప్పలేదు. మామూలుగా అయితే మోడీ వ్యవహారశైలికి ఇది భిన్నమనే చెప్పాలి. తన ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు, విమర్శలకు మోడీ ఏదో సమాధానం చెప్పేస్తారు. దేన్నీ బాకీ ఉంచుకోరన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇపుడు మాత్రం అసలు నోరే ఎత్తలేదు. ఎంతసేపు కరోనా సమయంలో అది చేశాం, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇదిచేశాం, ఇన్నర్ రోడ్లకు నిధులిచ్చాము, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ రోడ్లకు నిధులిచ్చామని మాత్రమే చెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు తేడా తెలీనంత అమయాకుడా మోడీ ? మొత్తానికి మోడీ ప్రసంగం యావత్తు చాలా చప్పగా జరిగిందనే చెప్పాలి. కేసీయార్+కాంగ్రెస్ పై పిడుగులు కురిపిస్తారని ఆశించిన వారందరినీ మోడీ పూర్తిగా నిరాశ పరిచారనే చెప్పాలి.