విప్లవం వినిపించిన చోటు..విప్లవమే జీవితం అయిన చోటు.. విప్లవం విశాఖ మన్యం నుంచి గోదావరి తీరాల వరకూ వ్యాప్తించిన చోటు.. అదిగదిగో అల్లూరి సీతారామరాజు.. ఆయన 125 వ జయంత్యుత్సవాలకు బీజేపీ పరివారం తరలి వెళ్తోంది. ఇక మిగిలిన పార్టీలు కూడా భీమ వరం కేంద్రంగా మోహరించాయి. అల్లూరి స్ఫూర్తిని అందుకునేందుకు జాతిని నడిపిన వైనాన్ని గుర్తు చేసుకునేందుకు ఓ సువర్ణావకాశం ఈ రోజు (జూలై నాలుగు, 2022) . ఇప్పటికే భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహం సిద్ధం అయింది. సభకు సంబంధించి పెదఅమిరం కూడా సిద్ధమైంది. మోడీ రాకతో ఈ ఉత్సవాలకు ఉన్న ప్రాధాన్యం కూడా ఒక్కసారిగా పెరిగింది.
అల్లూరి అందరి వాడు అన్న భావనతో అన్ని పార్టీలనూ ఇందులో మమేకం చేస్తోంది ఉత్సవ కమిటీ. చంద్రబాబు రాక లేకపోయినా టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు వస్తున్నారు. రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు రాక షురూ అయింది. పవన్ తో సహా చిరంజీవి కూడా వస్తున్నారు. ఆ విధంగా ఈ వేడుకలకు సినీ గ్లామర్ కూడా తోడయింది. అల్లూరి కోసం మోడీ ఏంచెప్పబోతున్నారు. అల్లూరు నడయాడిన మోగల్లు ప్రాంతంలో ఓ స్మారక మందిరం కట్టాలన్నది ఇక్కడి వారి కోరిక.. కనీసం దాన్నయినా నెరవేరుస్తారా అన్న సందేహాలు ఇక్కడ నెలకొని ఉన్నాయి.
ఇవాళ జరిగే సభలో వేదికపై 11 మంది మాత్రమే ఉంటారు. ప్రధాని నరేంద్రమోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్, సీఎం జగన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా మిగిలిన ఏడుగురికి ఛాన్స్ ఉంది. ఉదయం పది గంటల యాభై నిమిషాల నుంచి ప్రసంగాలు ఉంటాయి. ప్రధానిని గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద ముఖ్యమంత్రి స్వాగతించనున్నారు. అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ
అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో ప్రధాని ముచ్చటించనున్నారు.