దాదాపు పది రోజుల మహారాష్ట్ర సంక్షోభానికి తెరపడింది. సంక్షోభం ముగింపు అందరి అంచనాలకు కాస్త భిన్నంగానే వచ్చింది. శివసేన చీఫ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే కూల్చేసిన విషయం తెలిసిందే.
పార్టీకి చెందిన 55 మంది ఎంఎల్ఏల్లో 40 మందిని తన వైపుకు తిప్పుకుని థాక్రేకి ఎదురుతిరగటంతో సంక్షోభం మొదలైంది. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే పదిరోజుల సంక్షోభం ముగిసింది.
గురువారం సాయంత్రం బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం తీసుకోవటం లేదన్నారు. షిండేనే సీఎంగా బాధ్యతలు తీసుకుంటారని ప్రకటించారు. అయితే రాత్రయ్యేసరికి ఏమైందో ఏమో షిండే సీఎంగా బాధ్యతలు తీసుకోగా దేవేంద్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రెండు పార్టీలు కలిపి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.
అంతా బాగానే ఉంది కానీ ప్రమాణ స్వీకారంలోనే దేవేంద్ర కక్కుర్తి బయపడింది. కక్కుర్తి ఏమిటంటే ఇపుడు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దేవేంద్ర గతంలోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నేత మళ్ళీ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటమంటేనే విచిత్రంగా ఉంది. సీఎంగా చేసిన వ్యక్తి అవకాశముంటే మళ్ళీ సీఎంగానే బాధ్యతలు తీసుకుంటారు. అలా సాధ్యం కాకపోతే కేంద్రంలో మంత్రిగా వెళిపోతారు. అంతేకానీ డిప్యూటీ సీఎంగా మాత్రం పని చేయరు.
కానీ ఇపుడు దేవేంద్ర ఆపనిచేయటంతోనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. డిప్యూటీ సీఎంగా దేవేంద్ర బాధ్యతలు తీసుకునే బదులు ఇంకెవరైనా సీనియర్ తో ప్రమాణం చేయించుంటే బాగుండేది. మంత్రివర్గానికి ఫడ్నవీస్ దూరంగా ఉండి సీనియర్లు+యువతను పంపుంటే అందరు హర్షం వ్యక్తం చేసేవారు. దేవేంద్రకు కూడా మర్యాద నిలిచేది.
అలాంటిది దేవేంద్ర ఇప్పుడు తన పరువును తానే దిగజార్చేసుకున్నారనే విమర్శలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వంలో చేరమని, బయటనుండే షిండే ప్రభుత్వానికి మద్దతిస్తామని సాయంత్రం చెప్పకుండా ఉంటే బాగుండేది. అలా కాదని తాను ప్రకటించిన విధానాన్ని కొద్ది గంటల వ్యవధిలోనే తానే రివర్సులో వ్యవహరించటమే విచిత్రంగా ఉంది.