ఈసారి కాకుంటే ఇంకెప్పటికి అన్నట్లుగా డీఎంకే అధినేత స్టాలిన్ ఈసారి ఎన్నికల్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాదిరి ఒక సంప్రదాయం తమిళనాడులో ఉంది. ఇక్కడ జరిగే ఎన్నికల్లో అధికారపక్షం ఓటమిపాలు కావటం.. విపక్షం విజయం సాధించటం జరుగుతుంది. ఈ క్రమాన్నిబ్రేక్ చేశారు దివంగత సీఎం జయలలిత. దీంతో.. వరుసగా పదేళ్ల పాటు అధికారాన్ని కోల్పోయిన డీఎంకే.. ఈసారి అసెంబ్లీలో గెలుపు తమ ఖాతాలో పడాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ప్రత్యర్థులు తమను తప్పు పట్టే అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో సినీ నటుడైన తన కొడుక్కి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు సైతం నో చెప్పారు.
కాంగ్రెస్ తో కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్న డీఎంకే.. ఈసారి గెలుపు ధీమా మీద ఉన్నారు. తాజాగా తమ పార్టీ ఎన్నికల హామీల చిట్టానుఆయన విడుదల చేశారు.తాముఅధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.1000 చొప్పున ఆర్థికసాయాన్ని అందిస్తామని ప్రకటించారు. తాము ఇచ్చే డబ్బుతో రేషన్ షాపుల్లోతక్కువ ధరకే నిత్యవసర వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చని చెబుతున్నారు. తాజాగా తమ పార్టీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన ఆయన.. తాము పవర్లోకి వస్తే .. ఏమేం చేస్తామన్న విషయాన్ని తాజాగా వెల్లడించారు. పలు సంక్షేమ పథకాల్ని ప్రకటించారు.
ఇప్పటివరకు ఎస్సీ.. ఎస్టీలకు ఇతర వెనుకబడిన వర్గాలకు ఇచ్చే విద్యా స్కాలర్ షిప్ లను రెట్టింపు చేస్తామన్న ఆయన.. పారిశుధ్య కార్మికులు చేస్తున్న మురుగునీటి పనుల స్థానంలో పూర్తిగా యంత్రాల్ని వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని.. విద్య.. ఆరోగ్యం.. పారిశుద్ధ్యం.. నీటి నిర్వహణను మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు.ఏడాదికి పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. డబుల్ డిజిట్ డెవలప్ మెంట్ ను సాధిస్తామన్నారు. రానున్న పదేళ్లలో రాష్ట్రంలోనికోటి మందిని దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. మరిన్ని హామీలు అమలు సాధ్యమేనా? అన్న సందేహాన్ని పక్కన పెడితే.. ఓటర్లను ఆకర్షించే విషయంలో మాత్రం స్టాలిన్ ఏ మాత్రం తగ్గట్లేదని చెప్పక తప్పదు.