చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్ అపాయింట్ దొరకడం అంటే తిరుపతి లడ్డూ దొరికినట్టేనని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ ను కలవాలంటే అదో పెద్ద ప్రహసనం అని, చాలామంది శాసన సభ్యులకు జగన్ దర్శనం కన్నా తిరుమల వెంకన్న దర్శనం సులువుగా దొరుకుతుందని టాక్. అయితే, జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంటుందని, వారికి మాత్రం జగన్ తో ఎపుడు కావాలంటే అపుడు అపాయింట్ మెంట్ వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక, మీడియా ముందుకు కూడా కొందరు పరిమిత వైసీపీ నేతలు మాత్రమే మాట్లాడతారని, మిగతా మంత్రులు మాట్లాడాలని ఉన్నా మాట్లాడే అవకాశం లేదన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ మధ్యకాలంలో మంత్రుల కన్నా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సజ్జలకు మంత్రి పదవి లేదని, కానీ, ఆయన సకల శాఖా మంత్రి అని ఎద్దేవా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. సజ్జలకు ఏం నాలెడ్జ్ ఉందని, ఆయన కూడా ఒక సలహాదారుడేనా అని ఎద్దేవా చేశారు. క్యాబినెట్ వ్యవహారాలు కూడా సజ్జల చెప్పడం ఏంటని, మంత్రులను కూడా సజ్జల ప్రక్కన పెట్టేశాడని విమర్శించారు. అధికారులు దగ్గరుండి తన ఇంటి గోడను పగులగొట్టించారని, ముందస్తు నోటీసు కూడా ఇవ్వలేదని విరుచుకుపడ్డారు.
టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని, దొంగోడు చెపితే… పోలీసులు తమను దొంగలను చేస్తున్నారని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చెత్త మద్యాన్ని అమ్ముతున్నారని, మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. యాచకుల దగ్గర కూడా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. మద్యం షాపుల్లో జరిగే దోపిడీ సొమ్ము జగన్ ప్యాలెస్ కి వెళ్తోందని ఆరోపించారు. వరద సహాయక చర్యల్లో జగన్, ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అన్నారు
Comments 1