కొంతకాలంగా సినిమా టికెట్ల వ్యవహారంపై సినీ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెట్ల విధానం వల్ల తమకు నష్టమని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై చర్చించేందుకు ఏపీలోని 13జిల్లాల నుండి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.
మా వ్యాపారం మేము చేసుకుంటామంటే, ప్రభుత్వం మా వ్యాపారాన్ని నిర్వహిస్తామనడంలో అర్థం లేదని ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలలో ఇలా లేదని, ఏపీలో ఇండస్ట్రీ పరిస్దితి ఏంటో అర్థం కావడం లేని వాపోయారు. ఇకపై న్యాయస్థానం ద్వారానూ తమ కార్యకలాపాలుంటాయని స్పష్టంచేశారు. టిక్కెట్ ధరలపై ప్రభుత్వ నిర్ణయం కోర్టులో పెండింగ్ లో ఉందని, ఆ తీర్పు వచ్చిన తరువాత ఏం చేయాలో నిర్ణయిస్తామని ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్. రామ్ ప్రసాద్ వెల్లడించారు.
జగన్ ప్రభుత్వం టిక్కెట్లు అమ్మి ఆ డబ్బులను తమకు జమచేస్తామనటంలో అర్దం లేదని, ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బులు తమకు తిరిగి జమ అవుతాయనే నమ్మకం కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. థియేటర్లను కాపాడుకోవటానికి, మనుగడను నిలపుకోవటానికి ఇండస్ట్రీలోని పెద్దలంతా సహకరించాలని అన్నారు. పెద్ద హీరోల సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలంటే 8వారాలు ఆగాల్సిందేనని, చిన్న చిత్రాలకు 4 వారాలు గడువు సరిపోతుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
ఓటీటీ వల్ల థియేటర్లకు ప్రేక్షకుల సంఖ్య తగ్గి యాజమాన్యాలు నష్టపోతున్నాయని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రమేష్ అన్నారు. హీరోలు మాత్రమే ఇండస్ట్రీలో బాగున్నారని, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు. హిందీలో నిర్మాతలే డిజిటల్ ఖర్చులు భరిస్తారని, ఇక, తమిళనాడులో డిజిటల్ ఖర్చు నాలుగు వేలు మాత్రమేనని, కానీ ఇక్కడ 12,500 వరకు ఉందని అన్నారు. దీనిని తగ్గించడంతోపాటు నిర్మాతలే ఆ ఖర్చు భరించే విధంగా తీర్మానం చేశామని, రెంటల్ విధానంలో మార్పు చేయాలని నిర్మాతలను కోరామని చెప్పారు. ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి తాము తీర్మానించిన విషయాలపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Comments 1