అన్నమయ్య కీర్తన `ఒకపరి ఒకపరి వయ్యారమే`ను ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి అవమానించిందంటూ హిందూ సంఘాలు, అన్నమయ్య వారసులు మండిపడుతోన్న సంగతి తెలిసిందే. తన అంద చందాలను చూపిస్తూ అన్నమయ్య కీర్తనను పాడడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు. అంతేకాదు, ఆ పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఆ డిమాండ్లపై శ్రావణ భార్గవి ఇంతవరకు స్పందించలేదు.
దీంతో, తాజాగా శ్రావణ భార్గవిపై తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్లో తిరుపతికి చెందిన పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నమయ్య వారసులకు శ్రావణ భార్గవి తక్షణమే క్షమాపణలు చెప్పాలని, ఆ వీడియోను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
అంతేకాదు, ఆ వీడియోను తొలగించకుంటే శ్రావణి భార్గవిని తిరుపతిలో అడుగు పెట్టనివ్వబోమని, జన్మలో ఆమె శ్రీవారి దర్శనం చేసుకోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దాంతోపాటు, అన్నమయ్య కీర్తనలను ఎవరూ తప్పుగా చిత్రీకరించకుండా టీటీడీ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఇంత రచ్చ జరుగుతుంటే టీటీడీ ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు.
మరోవైపు, అన్నమయ్య ట్రస్ట్ సభ్యుడికి, శ్రావణ భార్గవికి మధ్య జరిగినట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పలువురు శ్రావణ భార్గవి వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు శ్రావణ భార్గవిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, మహిళా గాయకులు పాటను విడుదల చేసినప్పుడే ప్రజలకు అభ్యంతరాలుంటాయని, తన వీడియోలో అశ్లీలత లేదని శ్రావణ భార్గవి వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. అదే పురుష గాయకులు విడుదల చేసిన ఆల్బమ్‌లను పట్టించుకోరిని శ్రావణ భార్గవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Comments 1