తన పరువుకు భంగం కలిగేలా కథనాలు వండి వార్చిందన్న కారణంతో సాక్షి మీడియాపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ గతంలోనే రెండు సార్లు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వైఎస్ భారతీరెడ్డి, పాలకవర్గం డైరెక్టర్లు, ఎడిటర్ ఇన్ చీఫ్ నేమాని భాస్కర్, కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్లతో ఆ నోటీసులిచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకుగాను బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు, 15 రోజుల్లో తన నోటీసులకు సమాధానమివ్వకుంటే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటానని, రూ.50 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా, సరే, ఆ నోటీసులకు సాక్షి మీడియా స్పందించలేదు. దాంతోపాటు, సాక్షి మీడియాకు కేంద్ర హోం శాఖ అనుమతి లేదని, 20 మంది సాక్షి ఉద్యోగులు కోరడంతో హైకోర్టు ఇచ్చిన స్టే జులై7 తో ముగిసిందని రఘురామ అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సాక్షి మీడియాకు రఘురామ మరో షాకిచ్చారు. సీఎం జగన్ కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షి టీవీ ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ప్రకారం కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ కు రఘురామ లేఖ రాశారు. అంతేకాదు, సాక్షి టీవీ లైనెన్స్ను కూడా తక్షణమే రద్దు చేయాలని ఆయన ఠాకూర్‌ను కోరారు. సాక్షి టీవీ లైసెస్స్ రద్దు, ప్రసారాల నిలిపివేత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. సాక్షి టీవీతో పాటు సాక్షి దినపత్రికను నడుపుతున్న సంస్థలకు జగన్ భార్య వైఎస్ భారతి చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ రద్దు కాబోతున్నట్లు కోర్టు తీర్పుకంటే ముందే సాక్షి మీడియాలో రావడంపై రఘురామ గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పులివ్వడానికి ముందే జగన్ సొంత మీడియాలో తీర్పులు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
Comments 1