“అప్పులు చేశాం. ఇంకా చేస్తాం.. మా కోసమేమన్నా చేస్తున్నామా? రాష్ట్ర ప్రజలకోసమే కదా?! ఇవన్నీ..“- ఇదీ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు.
రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయి.. వచ్చే సంవత్సరాల్లో ఇబ్బందులు పడడం ఖాయమంటూ.. ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై మేధావులు సైతం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇన్ని అప్పులు అవసరమా? అని చర్చిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఇది భారీ ఎత్తున ప్రభావం పడుతుందని.. వైసీపీ నేతలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అప్పులపై వివరణ ఇచ్చేందుకు మంత్రి బుగ్గన ప్రయత్నించారు. అయితే.. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన రివర్స్ సమాధానాలు చెప్పడం గమనార్హం. బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ అప్పు చేసింది వాస్తవమేనని తెలిపారు. అయితే.. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాబడి తగ్గిందని, ఖర్చు విపరీతంగా పెరిగిందని తెలిపారు.
ఆదాయం లేకున్నా ప్రజలకు ఖర్చుచేసి ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దాదాపూ ప్రతిరోజూ.. కరోనా నియంత్రణ చర్యల కోసం రూ. వందలకోట్లు వెచ్చించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ తెచ్చుకోగలిగామని తెలిపారు.
రాష్ట్రం పదినెలలకు తీసుకున్న రుణం రూ.73,913 కోట్లకు చేరిందని నివేదికలో కాగ్ పేర్కొంది. బడ్జెట్లో అంచనా రూ.48,295 కోట్లు కాగా.. ఇది అంచనాకన్నా 153 శాతం ఎక్కువ అని తెలిపింది. ఇక రెవెన్యూ లోటు పెరిగిపోతోందని, ఇది 300 శాతం అధికమని కాగ్ తెలిపింది. బడ్జెట్లో రెవెన్యూ లోటు అంచనా రూ.18, 434 కోట్లు ఉండగా.. అసలు రెవెన్యూ లోటు రూ.54,046 కోట్లు ఉందని రిపోర్టులో ప్రస్తావించింది.
రెవెన్యూ రాబడి పెరిగినా సంక్షేమ కార్యక్రమాలతో అప్పుల ఊబిలో ఏపీ చిక్కుకుంది. గతేడాది జనవరి నెలాఖరు వరకు అప్పులు రూ.46,503 కోట్లు తీసుకుందని, బహిరంగ మార్కెట్ రుణాల సేకరణలో ఏపీకి దేశంలో 4వ స్థానంలో ఉందని కాగ్ తెలిపింది. అయినప్పటికీ.. జగన్ సర్కారు మాత్రం ఆదాయంపై దృష్టి పెట్టకుండా.. అప్పులపైనే ధ్యాస పెట్టడం గమనార్హం.