పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నప్పటికీ వరద బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు పెద్ద సాహసమే చేశారు. ఈ క్రమంలోనే నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పటికీ పడవలలో ప్రయాణించి మరీ వరద బాధితులను చేరుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా సోంపల్లి వద్ద టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న రెండు పడవలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. దీంతో, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, ఉండి ఎమ్మెల్యే రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు పార్టీకి చెందిన మరో నేత సత్యనారాయణ, కొందరు మీడియా ప్రతినిధులు గోదావరి నదిలో పడిపోయారు.
అయితే, అదృష్టవశాత్తూ చంద్రబాబు నీటిలో పడలేదు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదంపై తక్షణమే స్పందించిన మత్స్యకారులు వెంటనే నీటిలోకి దిగి టీడీపీ నేతలను నదిలో నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మత్స్యకారులు వేగంగా స్పందించిన నేపథ్యంలో అందరూ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments 1