అమెరికాలోని బోస్టన్ నగరంలో మునుపెన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ను ఎన్నారై టీడీపీ యూఎస్ కో ఆర్డినేటర్ జయరాం కోమటి నేతృత్వంలో కన్నుల పండుగగా, అట్టహాసంగా నిర్వహించారు. అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ మహానాడులో పాల్గొని బోస్టన్ ను పసుపుమయం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ క్రమంలోనే బోస్టన్ మహానాడు వేదికగా చేపట్టిన విరాళాల సేకరణ విజయవంతమైంది. మొత్తంగా రూ. కోటి రూపాయల విరాళాలను సేకరించారు. తాజాగా నేడు టీడీపీ అధినేత చంద్రబాబును టీడీపీ ఎన్నారై సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా రూ. కోటి రూపాయల చెక్కును చంద్రబాబుకు వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గుళ్లపల్లి, కృష్ణ గొంప, మోహన్ కృష్ణ మన్నవ, వెంకట్ కోగంటి, రాజా సూరపనేని, భాస్కర్ అన్నే తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఏడాది పొడవునా అమెరికాలోని వివిధ నగరాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఎన్నారై టీడీపీ తరపున నిర్వహించబోతోన్న సంగతి తెలిసిందే. 2023 మే 28వ తేదీన అమెరికాలో భారీ స్థాయిలో మహానాడు నిర్వహించనున్నారు. మహిళలు కూడా శత జయంతి వేడుకల్లో చురుకుగా పాల్గొనే విధంగా మహిళా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.